Share News

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:09 AM

ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది.

 ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం
పోలింగ్‌ను పరిశీలిస్తున్న పాలమూరు కలెక్టర్‌ గుగులోతు రవి

- క్యాంపుల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు

- బీఆర్‌ఎస్‌ నుంచే అత్యధికం

- వారిని సంప్రదించడంతో క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ ఆశలు

- ఓటేసిన సీఎం రేవంత్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

- ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు, గెలుపుపై ఉత్కంఠ

మహబూబ్‌నగర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మొత్తం 1,439 ఓట్లకు గాను 1,437 పోల్‌ అయ్యి.. 99.86 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనా పోలింగ్‌ క్యాంపులకు వెళ్లిన వారి బస్సులు ఒక్కొక్కటిగా రావడంతో 11 గంటల నుంచి 2 గంటల మధ్యలో భారీగా పోలింగ్‌ జరిగింది. ఆ తర్వాత మిగిలిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ తరపున క్యాంపులకు వెళ్లిన వారే అత్యధికంగా వచ్చారు. మొదటి నుంచీ బీఆర్‌ఎస్‌ పార్టీకి స్థానిక సంస్థల్లో బలం ఉండటం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డి ఖరారైన వెంటనే క్యాంపు రాజకీయాలకు తెరలేపడం, ఏకంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ సైతం గోవాకు వెళ్లి ప్రజాప్రతినిధులతో గడపటం, అలాగే చాలామంది మంత్రులు, పార్టీలో కీలక వ్యక్తులు ఎప్పటికప్పుడు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో బీఆర్‌ఎస్‌ క్యాంపును కాపాడుకున్నారు. కాంగ్రెస్‌ తన బలాన్ని కాపాడుకోవడంతోపాటు నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచే ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టింది. ఇబ్బడిముబ్బడిగా చేర్చుకోవడంతో బలం పెంచుకున్నారు. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు క్యాంపులను కూడా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ క్యాంపులకు వెళ్లిన వారితో కూడా టచ్‌లో ఉండి.. వారిని మేనేజ్‌ చేసుకోవడంతో క్రాస్‌ ఓటింగ్‌పై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. పోరు హోరాహోరీగా సాగడంతో ఎంతవరకు క్రాస్‌ ఓటింగ్‌ అయ్యింది? ఎవరికి విజయావకాశాలు ఉంటాయనే విషయంలో ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు తర్వాతనే తేలనుంది.

పోలింగ్‌ సరళి ఇలా...

ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. అన్ని సెంటర్లలోనూ 11 గంటల వరకు తక్కువగానే పోలింగ్‌ నమోదైంది. క్యాంపులకు వెళ్లిన వారు 11 గంటల తర్వాతనే రావడంతో పోలింగ్‌ శాతం 2 గంటల వరకు భారీగా నమోదైంది. ఆ తర్వాత మిగిలిన కొద్దిమంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో 245 మందికి ఓటు హక్కు ఉండగా.. వందశాతం పోలింగ్‌ నమోదైంది. కొడంగల్‌లో 56 ఓట్లు ఉండగా అక్కడా పోలింగ్‌ వందశాతం నమోదైంది. వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌, అచ్చంపేట, షాద్‌నగర్‌, కల్వకుర్తిల్లో కూడా వందశాతం పోలింగ్‌ నమోదైంది. నారాయణపేట పోలింగ్‌ కేంద్రంలో 205 ఓట్లు ఉండగా.. మక్తల్‌ మండలం మంతన్‌గోడ్‌ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర ఓటు వేయలేదు. అలాగే నాగర్‌కర్నూల్‌ పోలింగ్‌ కేంద్రంలో 101 ఓట్లు ఉండగా.. 100 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారదమ్మ రెండు నెలల క్రితం అమెరికా వెళ్లడంతో ఓటు వినియోగించుకోలేక పోయారు. దీంతో పోలింగ్‌ శాతం 99.86 శాతంగా నమోదైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సెంటర్‌కు వంద మీటర్ల లోపలకు ఓటర్లను తప్పా వేరేవారిని పంపించలేదు. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవి గుగులోత్‌ పోలింగ్‌ సెంటర్ల వద్ద పరిస్థితిని వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. వివిధ జిల్లాల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

ప్రముఖుల ఎక్స్‌ అఫిషియో ఓట్లు..

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌లో తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డుమార్గం ద్వారా కొడంగల్‌ కు చేరుకున్న ఆయన నేరుగా పోలింగ్‌ కేంద్రంలో ఓటువేసి.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల సమావేశంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధు సూధన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి ఓటు వేశారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఓటు వేయగా.. కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు పోతుగంటి భరత్‌ప్రసాద్‌, నాగర్‌కర్నూల్‌లో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి ఓటు వేశారు. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, గద్వాలలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, జడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, నారాయణపేటలో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి ఓటు వేశారు.

స్ట్రాంగ్‌ రూమ్‌కు పోలింగ్‌ బాక్సులు

మహబూబ్‌నగర్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అనం తరం ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి పోలింగ్‌ బాక్స్‌లను ప్రత్యేక వాహనాలలో బాలుర జూనియర్‌ కళా శాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. అక్కడ ఉన్న అధికారులు పోలింగ్‌ బాక్స్‌ల వివరాలను నమో దుచేసుకుని గదులకు తరలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యే వర్సెస్‌ సీఐ..

గద్వాల పోలింగ్‌ కేంద్రం లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి, గద్వాల సీఐ భీంనాయక్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న ది. ఓటు వేసిన తర్వాత అక్కడ నిలుచున్న ఎమ్మెల్యేను బయటకు వెళ్లాలని.. జడ్పీ చైర్‌పర్సన్‌ ఓటు వేయడానికి వస్తున్నారని చెప్పడంతో.. ఎమ్మెల్యే బదులిస్తూ తమ ఎంపీటీసీ సభ్యురాలు రావాలని.. ఆమె వచ్చిన వెంట నే తాను బయటకు వెళ్తానని సీఐకి సమా ధానమిచ్చారు. లేదు వెళ్లాల్సిందేనని సీఐ చెప్పడంతో కొంత వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎంపీటీసీ లోపలకు రావడం, ఏఎస్పీ వచ్చి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యేతో జరిగిన వాగ్వాదాన్ని కవర్‌ చేశారనే కారణంతో ఆ తర్వాత మీడియాను కూడా పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు అనుమతించలేదు. కలెక్టర్‌ చెప్పినప్పటికీ.. పోలీసులు అనుమతి నిరాకరించడంతో విలేకరులు కూడా వాగ్వాదానికి దిగారు.

Updated Date - Mar 29 , 2024 | 12:10 AM