Share News

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:21 PM

వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
గోనుపాడు గ్రామంలో పర్యటిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- గోనుపాడులో మిషన్‌ భగీరథ నీటి సరఫరా పరిశీలన

గద్వాల, మార్చి 12 : వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని గోనుపాడులో మిషన్‌ భగీరథ నీటి సరఫరాను మంగళవారం ఆయన పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో మిషన్‌ భగీరథ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రాజెక్టులోని నీటి నిల్వలు, మిషన్‌ భగీరథ నీరు ఎంతమేరకు సరఫరా అవుతున్నాయి, నీటి ఎద్దడి ఎక్కడ ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గ్రామాల్లో మంచి నీటి వన రులు, సరఫరాపై తెలుసుకొని, ప్రత్యామ్నాయ మార్గాల ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రతీ రోజు క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెం టనే అరికట్టాలన్నారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కబ్జాకు గురవుతున్న గ్రామ కంఠం భూమిని కాపాడాలని కోరు తూ స్థానికులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్‌ వెంట మిషన్‌ భగీరథ ఎస్‌ఈ జగన్‌మోహన్‌, ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో చెన్నయ్య, ప్రత్యేకాధికారి శివకుమార్‌, పంచాయతీ కార్యదర్శి సహేలా పాల్గొన్నారు.

అర్హులందరికీ ఓటు హక్కు నమోదు

గద్వాల న్యూటౌన్‌ : జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరినీ ఫామ్‌-6 ద్వారా ఓటర్‌గా నమోదు చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ద్వారా ఏ క్షణంలోనైనా షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఓటరు నమోదుపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో టామ్‌టామ్‌ వేయించాలన్నారు. యువతకు ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియ జేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వచౌహాన్‌, ముసిని వెంకటేశ్వర్లు, స్వీప్‌ నోడల్‌ అధికారి రమేష్‌బాబు, ఈడీఎం శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 11:21 PM