Share News

గద్వాలలో భారీ చోరీ

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:13 AM

జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు.

గద్వాలలో భారీ చోరీ

- 40 తులాల బంగారం, రూ. 10 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

గద్వాల క్రైం, మార్చి 28 : జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా బుధవారం రాత్రి లింగంబాగ్‌ కాలనీలో ఉన్న ఓ వ్యాపారి ఇంట్లో చోరీ చేసి 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 10 లక్షల నగదును చోరీ చేశారు. ఇందుకు సంబంఽధించి బాధితుడు రాజేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల జిల్లా కేంద్రంలోని లింగంబాగ్‌ కాలనీలో ఇన్గూరు వెంకటేశ్వర్లు అనే వ్యాపారి కుటుంబం ఈ నెల 26న బెంగలూరులో ఒక ఫంక్షన్‌కు వెళ్లారు. ఇంటికి రెండు రోజులుగా తాళాలు ఉండటంతో ఇదే అదనుగా భావించిన దొంగలు తాళాలను విరగ్గొట్టి ఇంట్లో ఉన్న రూ. 10 లక్షల నగదుతో పాటు 40 తులాల బంగారు అభరణాలను దొంగిలించారు. అయితే ఆ ఇంటిలో ఉన్న లాకర్‌ తెరిచేందుకు కూడా దొంగలు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆ లాకర్‌ తెరుచుకొని ఉంటే ఇంకా భారీగా నగలు, నగదు చోరీ జరిగి ఉండేది. గురువారం బెంగళూరు నుంచి ఇన్గూరు వెంకటేశ్వర్లు కుమారుడు రాజేష్‌ వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చేశాడు. బీరువాలు తెరిచి ఉన్నాయని అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు చోరీ జరిగాయని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్ధలాన్ని పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు క్లూస్‌టీం పరిశీలించారు. అయితే ఈ చోరీకి పాల్పడిన వారు ఇద్దరు అని సీసీ కెమెరాలో నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 07:29 AM