Share News

రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి

ABN , Publish Date - Jan 21 , 2024 | 10:52 PM

పాలమూరు కాంగ్రె్‌సకు మరో కీలక పదవి వరించింది. మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి

కేబినెట్‌ హోదాలో దేశ రాజధానిలో బాధ్యతలు

సీఎం రేవంత్‌తో సాన్నిహిత్యం, అనుభవం కలిసొచ్చాయనే అభిప్రాయాలు

మహబూబ్‌నగర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలమూరు కాంగ్రె్‌సకు మరో కీలక పదవి వరించింది. మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. కేబినెట్‌ హోదాలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అన్నీతానై సారథ్యం వహించే మల్లు రవికి ఈ పదవి కట్టబెట్టడం ద్వారా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కేబినెట్‌కు కీలకమైన విషయాల్లో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సమైక్య రాష్ట్రంలోనూ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో మల్లురవి ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, సీఎం సహా రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు, అధికారులకు అవసరమైన పనులు చక్కబెట్టారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను తేవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే పేరు గడించారు. రేవంత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్న మల్లు రవి, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ నియామకం కావాలనే బలమైన వాదనను పార్టీలో నిర్మించారని, పార్టీలో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ పూర్తి మద్దతుగా నిలిచారని పార్టీలో చర్చ కొనసాగింది. రేవంత్‌కు సన్నిహితుడిగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నీ తానై అండగా ఉన్నారని, ఆ గుర్తింపు, గౌరవం వల్లే తాజాగా మల్లు రవికి అత్యంత కీలకమైన పదవి మరోసారి కట్టబెట్టారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్‌ వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రానికి ఉండాల్సిన గౌరవప్రదమైన సంబంధాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించారని నాయకులు చెబుతున్నారు. నిధులు, హక్కులు సాధించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కొనసాగించే నేర్పు, చాకచక్యంతో వ్యవహరించే మల్లు రవి వంటి సీనియర్‌ నాయకుడే ఈ పదవికి ఈసమయంలో సరైన వ్యక్తిగా పార్టీ ఉన్నతస్థాయి వర్గాల్లో ఉన్న అభిప్రాయం ఉందని అంటున్నారు. ఆ మేరకే ఆయనకు ఈ పదవి కట్టబెట్టిన ట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్‌ వాదిగా రాజకీయాల్లోకి..

బాల్యం నుంచి కాంగ్రెస్‌ వాదిగానే కొనసాగిన డాక్టర్‌ మల్లురవి తన సోదరుడు, మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంత రాములు మరణానంతరం పూర్తి స్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌, డీఎల్‌వో పట్టాలు పొందిన రవి తొలుత యూత్‌ కాంగ్రెస్‌ డాక్టర్స్‌ సెల్‌ చైర్మన్‌గా పని చేశారు. 1992 నుంచి ఇప్పటి వరకు ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సోదరుడు మల్లు అనంత రాములు మరణం తర్వాత 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి తొలిసారి బరిలో దిగి విజయం సాధించారు. ఆ పర్యాయం ఐదేళ్ల పాటు పూర్తి పదవిలో కొనసాగారు. తిరిగి 1998లో గెలుపొందారు. 1999లో మధ్యంతర ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అంతకుమునుపు 1996లోనూ ఎంపీ స్థానం చేజార్చుకున్నారు. ఆ తర్వాత 2004లో సమైక్య రాష్ట్రంలో డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో 2004-2008 మధ్యకాలంలో నాలుగేళ్ల పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించి, పార్టీలో కీలకనేతగా ఎదిగారు. అనంతరం 2008లో అనూహ్యంగా జడ్చర్ల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019లో మళ్లీ నాగర్‌కర్నూల్‌ లోక్‌సభకు పోటీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తాజాగా జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆయనే నాగర్‌కర్నూల్‌ ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ సాగుతున్న సందర్భంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని కట్టబెట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా?.. లేక ఈ టర్మ్‌కు కీలకమైన ఈపదవిలోనే కొనసాగుతారా?.. అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Jan 21 , 2024 | 10:52 PM