మద్దిమడుగుకు ఘనమైన చరిత్ర
ABN , Publish Date - Sep 05 , 2024 | 11:21 PM
నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామికి ఘనమైన చరిత్ర ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
- ఘనంగా కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం
అమ్రాబాద్ సెప్టెంబరు 5 : నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామికి ఘనమైన చరిత్ర ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. గురువారం ఆలయ పాలక మండలి చైర్మన్‌గా దేశవత్ రాములు నాయక్, 12 మంది పాలక మండలి సభ్యులకు ఆలయ ఆవరణలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నల్లమల ప్రాంతంలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కొత్తగా ఏర్పాటయిన పాలక మండలి ఆఽధ్వర్యంలో తక్షణమే నిర్ణయాల తీసుకుని ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావివ్వరాదని సూచించారు. మద్ది మడుగు ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాం తంలో పలు చోట్లకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక మినీ బస్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతం టూరిజం హబ్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను త్వరలోనే కలిసి కోరుతామన్నారు. అప్పర్ ప్లాట్ ప్రాంతానికి సాగునీరు అందించడంతో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శక్తి వంచన లేకుండా అమలు చేయనున్నట్లు వివరించారు. మద్దిమడుగు పేరును త్వరలో మద్దిపట్నంగా, ఈగలపెంట, దోమలపెంటలను విష్ణుగిరి, బ్రహ్మగిరిలుగా పేరు మార్పు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాలక మండలి చైర్మన్, సభ్యులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈవో రంగాచారి, అచ్చంపేట మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, గణేష్, హరినారాయణగౌడ్, మల్లికార్జున్, లింగం, బాల్ లింగంగౌడ్, నరహరి తదితరులున్నారు.