Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా వర్తింపచేయాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:58 PM

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

 ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా వర్తింపచేయాలి
సమావేశంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- బీఆర్‌ఎస్‌ నాయకుల డిమాండ్‌

నారాయణపేట టౌన్‌, మార్చి 6 :ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నారాయణపేటలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ప్రెస్‌మీట్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం మాట మార్చడం ఆ పార్టీలకు అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్‌ నాయకుడు గందె చంద్రకాంత్‌ అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు తాజా ఉదాహరణ లే ఔట్‌ రెగ్యులరైజేషన్‌ పేరుతో మళ్లీ డబ్బులు వసూలు చేస్తుందన్నారు. అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నాయకులు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫ్రీ అన్నారు. నేడు ఫీజు అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు దాచుకున్న సొమ్మును సర్కారు నిలువునా దోచుకుంటుందన్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, నేటికీ అతీగతీ లేదన్నారు. అధికారంలోకి రాగానే రూ.15 వేల రైతు భరోసా అని మాట తప్పిందన్నారు. ప్రభుత్వం కాసుల వేట ప్రారంభించిందని రూ.20 వేల కోట్లు భారం మోపేలా స్వయంగా ముఖ్యమంత్రే ఎల్‌ఆర్‌ఎస్‌ వేగవంతం అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారన్నారు. 25.44 లక్షల మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు వారి నుంచి చార్జీలను వసూలు చేసేందుకు నిర్ణయించారన్నారు. పేదలపై లక్షల రూపాయల భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తాజుద్దీన్‌, సుదర్శన్‌రెడ్డి, చెన్నారెడ్డి, రాములు, కన్న జగదీశ్‌, బండి శివరాంరెడ్డి, సుభాష్‌, అలీషేర్‌, సురేందర్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 10:58 PM