Share News

రుణమాఫీ అమలు చేస్తాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:37 PM

‘కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుంది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15న చేసి తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు’

రుణమాఫీ అమలు  చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ మల్లు రవి

- ఎన్నికల కోడ్‌తో అమలు కాని పథకాలు

- పార్లమెంటు సీటు గెలిచి రాహుల్‌కు బహుమతిగా ఇద్దాం

- ముఖ్య కార్యకర్తల సమావేశంలో డాక్టర్‌ మల్లురవి

గద్వాల, ఏప్రిల్‌ 30 : ‘కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుంది. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15న చేసి తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు’ అని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్‌ మల్లురవి అన్నారు. గద్వాల పట్టణంలోని సీఎన్‌జీ ఫంక్షన్‌ హాల్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చిందని, అందులో కొన్నింటిని అమలు చేశామని ఎలిపారు. మిగిలిన పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతుండగా, ఎమ్మెల్సీ, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో సాధ్యం కాలేదని వివరించారు. కొందరు మూర్ఖులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నది చూడటం లేదా అని ప్రశ్నించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని, ఉచిత విద్యుత్‌ అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. ఆగస్టు 15న రుణమాఫీని అమలు చేస్తామని ప్రతీ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ కొందరు తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని, వారికి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని సూచించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, అక్కడ కూడా ఐదు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే, ప్రతీ కార్యకర్త సైనికుడిగా పని చేసి గెలుపునకు కృషి చేయాలని కోరారు. నాగర్‌కరూల్‌లో గెలిచి రాహుల్‌ గాంధీకి గిఫ్ట్‌గా ఇద్దామని కోరారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, గట్టు తిమ్మప్ప, శంకర్‌, మధుసూదన్‌బాబు, గట్టు కృష్ణమూర్తి, అమరవాయి కృష్ణారెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

పార్టీలో చేరిన బీఆర్‌యస్‌ నాయకులు

డాక్టర్‌ మల్లురవి సమక్షంలో వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ధరూర్‌ మండల కేంద్రానికి చెందిన సత్యన్న, శ్రీనివాసులు, లాజర్‌, లైటర్‌ చిన్న, తిమ్మప్ప, గోవింద్‌, గోవర్ధన్‌లతో పాటు, మల్దకల్‌ మండలం తాటికుంట గ్రామానికి చెందిన మల్దకల్‌ గైడ్‌, కుర్వ బుడ్డన్న, భీమన్న, నర్సింహులు, రామన్నలతో పాటు 100 మంది పార్టీలో చేరారు. వారికి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లురవి కండువా కప్పి ఆహ్వానించారు.

Updated Date - Apr 30 , 2024 | 11:37 PM