Share News

పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:40 PM

మక్తల్‌ మండలంతో పాటు నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం
ఎమ్మెల్యేను సన్మానిస్తున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు

- మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, జనవరి 11 : మక్తల్‌ మండలంతో పాటు నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ వనజ అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా మండల సమావేశాన్ని భిన్నంగా నిర్వహించుకుందామన్నారు. వచ్చే మండల సమావేశానికి ఆయా శాఖల అఽధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు. ముఖ్యంగా సంగంబండ పునరావాస ప్యాకేజీకి సంబంధించి మంత్రులతో కలిసి మాట్లాడానన్నారు. రైతులందరికీ వారి వారి అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి దామోదర రాజ నర్సింహాను కలిసి నియోజకవర్గంలో వైద్య సదుపాయాలపై చర్చించానన్నారు. త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మక్తల్‌కు వస్తున్నట్లు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి సంగంబండ, భూత్పూర్‌, నేరడగం పునరావాస గ్రామాలపై చర్చించినట్లు తెలిపారు. సంగంబండ లో లెవల్‌ కెనాల్‌లో బండరాయిని తొలగించి, పెండింగ్‌ పనులు పూర్తి చేసి ఆయా గ్రామాలకు సాగునీరు అందిస్తానన్నారు. వీటితోపాటు నేరడగం, అనుగొండ, భూత్పూర్‌, ఉజ్జెల్లి గ్రామాలకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నియోకవర్గంలో ఏఏ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదో ఇప్పటికే నివేదిక అందించామన్నారు. ప్రతీ గ్రామంలో గ్రామ పంచాయతీ, పాఠశాల భవనం ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన వాటి వివరాలు అందించాలని కోరారు. మండలంలో సబ్‌ స్టేషన్‌ల సంఖ్యను పెంచాల్సి ఉందన్నారు. అనుగొండ, రుద్రసముద్రంలో నూతన సబ్‌స్టేషన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. నారాయణపేట, మక్తల్‌ రహదారితో పాటు సత్యవార్‌, గద్వాల్‌ రహదారి, అనుగొండ, మక్తల్‌ రహదారికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే సంగంబండ, గుడిగండ్ల, జక్లేర్‌లకు హెల్త్‌ సెంటర్లతోపాటు కర్నీ పీహెచ్‌సీలో ఎంబీబీఎస్‌ వైద్యుడిని ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ సభ్యులు కోరగా అందుకు స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్‌ భగీరథతో విలీనమైన సత్యసాయి కార్మికుల వేతనాల సమస్య పరిష్కరించి, తాగునీటి ఇబ్బందులు తీర్చాలన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం దారుణం అన్నారు. మక్తల్‌ మండల కేంద్రంలో ఫైర్‌స్టేషన్‌, గురుకుల పాఠశాల, ఎద్దుల సంతకోసం ప్రభుత్వ స్థలం పరిశీలించి నివేదిక అందించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామేశ్వరీ, తహసీల్దార్‌ సువర్ణరాజు, ఎంపీడీవో సద్గుణ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:40 PM