Share News

రాంకుల కుంట ఆక్రమణ

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:11 PM

మండలంలోని బొలవోనిపల్లి గ్రామ శివారులోని రాంకులకుంటను ప్రభుత్వానికి అమ్మిన వ్యక్తులే ఆక్రమించుకున్నారు.

రాంకుల కుంట ఆక్రమణ
కుంటను తనిఖీ చేస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

- ప్రభుత్వానికి అమ్మకందారే కబ్జా

- పట్టించుకోని అధికారులు

- కుంటను పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

కోస్గి రూరల్‌, ఫిబ్రవరి 12 : మండలంలోని బొలవోనిపల్లి గ్రామ శివారులోని రాంకులకుంటను ప్రభుత్వానికి అమ్మిన వ్యక్తులే ఆక్రమించుకున్నారు. పదేపదే గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. గ్రామ శివారులోని 463, 464, 465, 467, 403లో మొత్తం సుమారు 19 ఎకరాల భూమిని ప్రభుత్వం 1989-90లో ఇరిగేషన్‌ శాఖ రాంకులకుంట ఏర్పాటుకు కొనుగోలు చేసింది. అప్పట్లో మార్కెట్‌ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రొసిడింగ్‌లను ఇరిగేషన్‌ శాఖకు అప్పగించింది. కానీ అప్పటి నుంచి అక్కడ తాత్కాలికంగా ఓ కట్ట వేశారు తప్ప ఆ భూమిని పట్టాదారు నుంచి ప్రభుత్వం తీసుకోలేదు. దీనికి కట్ట అలుగు, తూము ఉన్నప్పటికీ అటువైపు ఏ అధికారి వెళ్లలేదు. రెవెన్యూ అధికారులకు గ్రామస్థులు చెప్పినా తమకేమి తెలియదన్నట్లుగా ఉండిపోయారు. దీంతో రైతులు కట్టను కూడా తెంచారు. దీంతో కట్ట కింద ఉన్న రైతుల పంటలు వర్షా కాలంలో మునిగిపోతున్నాయి. కుంటలో మాత్రం అమ్మకం దారే పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని గ్రామస్థులు ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఇరిగేషన్‌ అధికారులు కుంటను తనిఖీ చేశారు. తమ రికార్డులలో ఈ కుంట ఉందని, అక్కడి కుంటలో సాగు చేసిన రైతు గోపాల్‌రెడ్డిని అడగగా అవును సార్‌ మేము అమ్మిన విషయం వాస్తవమని ఒప్పుకున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా ఈ కుంటను అధికారులు సర్వే చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా చేస్తారో? లేదో? వేచి చూడాలి.

ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రొసిడింగ్స్‌ ఉన్నాయి

ప్రభుత్వం 1989-90 సంవత్సరంలో రాంకుల కుంట ఏర్పాటుకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్‌ మా దగ్గర ఉన్నాయి. కాని ఇక్కడ ఆమ్మకం దారులే సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి మాకు అప్పగిస్తే మేము కుంటను ఏర్పాటు చేస్తాం.

ఆనంద్‌కిషోర్‌, డీఈ, ఇరిగేషన్‌

Updated Date - Feb 12 , 2024 | 11:11 PM