Share News

కొలిక్కిరాని శ్రీధర్‌ రెడ్డి హత్య కేసు

ABN , Publish Date - May 24 , 2024 | 10:57 PM

వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి హత్య వ్యవహారం కొలిక్కి రాలేదు. బుధవారం అర్ధరాత్రి చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్‌ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.

కొలిక్కిరాని శ్రీధర్‌ రెడ్డి హత్య కేసు
లక్ష్మిపల్లి గ్రామంలో హత్య జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ

హత్యపై పలు ఆరోపణలు

సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌

వనపర్తి క్రైమ్‌, మే24: వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి హత్య వ్యవహారం కొలిక్కి రాలేదు. బుధవారం అర్ధరాత్రి చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్‌ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వచ్చి నేరుగా పోలీసులపై, మంత్రి జూపల్లి కృష్ణారావుపై నిందారోపణలు చేయగా, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి జూపల్లి స్పందించారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి, బీఆర్‌ఎస్‌ శవ రాజకీయాలు చేస్తోందని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కు టుంబ సభ్యుల మధ్య ఉన్న తగవులపై విచారణ జరుపుతున్నారు. అయితే.. శ్రీధర్‌ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్లే హత్యకు గురయ్యారని కొందరు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో ఎవరో ఒకరు ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే మూడు సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూ సమస్యలో అదే గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అడ్డుగా రావడంతో అతనిపై హ త్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపించాడని, అతనే మనసులో పెట్టుకుని ఈ హత్య చేయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే శ్రీధర్‌రెడ్డి గ్రా మంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండటంతో అతడిని ఏమీ చేయలేక.. ప్రభుత్వం మారడంతో మాజీ ప్రజాప్రతినిధి అండతో అతని అనుచరులైన కొందరు ఈ హత్య చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామంలో జరిగే భూ పంచాయతీల విషయంలో బాధితులు శ్రీధర్‌ రెడ్డిని సంప్రదించే వారని, అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉం డటంతో చాలా వివాదాలను పరిష్కరించే వాడని, ఈ క్రమంలో పాతకక్షలు ఉన్న వారు ఈ హత్య చేసుంటారనే అనుమానాలు వస్తున్నాయి. గ్రామస్థులు మాత్రం శ్రీధర్‌ రెడ్డి హత్య రాజకీయ కోణంలోనే జరిగిందని, ఆయనకు వ్యక్తిగత సమస్యలు ఏవీ లేవని, ఆయన ఏ వివాదంలో తలదూర్చే వ్యక్తి కాదని అంటున్నారు. ప్రధానంగా.. రాజకీయ కక్షలతో పాటు వివాహేతర సంబంధంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్నారని స మాచారం. ఈ ఉదాంతం రాజకీయ రంగు పులుముకోవడం, సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీల నాయకు లు వారు ఆరోపణలు చేసుకుంటుండటం, కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగిన లక్ష్మిపల్లి గ్రామానికి ఎస్పీ రక్షిత కె.మూర్తి శుక్రవారం చేరుకున్నారు. ఘటనా పరిశీలించారు. ట్రైనింగ్‌ ఎస్పీ చిత్తరంజన్‌ దాస్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణం రావు, స్థానిక ఎస్‌ఐ పబ్బతి రమే్‌షలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీధర్‌ రెడ్డి అన్నతో మాట్లాడారు. పాతకక్షలు, రాజకీయ వ్యవహారం, కుటుంబ సభ్యులు, భూ తగాదాల సమస్యలు ఏవైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. ఈ విషయమై వనపర్తి సీఐ నాగభూషణం రావును వివరణ కోరగా కేసు విచారణలో ఉందని తెలిపారు.

గ్రామంలో పోలీస్‌ పికెట్‌

శ్రీధర్‌రెడ్డి హత్యతో లక్ష్మిపల్లిలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 50 మందికిపైగా పోలీసులు సీఐ నాగభూషణం ఆధ్వర్యంలో గ్రామంలో మోహరించారు. ప్రతీ ఇంటికి ఇద్దరు సిబ్బంది తిరుగుతూ ఇంట్లో నివసిస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తుల ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పికెట్‌ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 10:57 PM