Share News

కీలక సూత్రధారి జంప్‌?

ABN , Publish Date - May 27 , 2024 | 10:59 PM

: జోగుళాంబ గద్వాల జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన బెట్టింగ్‌ కేసులో ప్రధాన సూత్రధారి, అయిజకు చెందిన వడ్ల రాఘవాచారి జిల్లా నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం అతడు తన మకాంను గోవాకు మార్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

కీలక సూత్రధారి జంప్‌?

బెట్టింగ్‌ కేసుపై కొనసాగుతున్న విచారణ

కొందరు నాయకుల నుంచి పోలీసులపై ఒత్తిడి!

గద్వాల క్రైం, మే 27 : జోగుళాంబ గద్వాల జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన బెట్టింగ్‌ కేసులో ప్రధాన సూత్రధారి, అయిజకు చెందిన వడ్ల రాఘవాచారి జిల్లా నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం అతడు తన మకాంను గోవాకు మార్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్న విషయాలపై స్థానికులు కొందరు అతడికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మొదట నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని విచారిస్తుండగా మరికొందరి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుల సంఖ్యలో రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ కేసులో పోలీస్‌ శాఖకు చెందిన అధికారి కుమారుడు ఉండటం వల్ల విచారణలో ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు కొందరు నాయకులు కేసును నీరుకార్చేందుకు ప్రయత్నిస్తూ, పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే బెట్టింగ్‌ వ్యవహారాన్ని ఎస్పీ రితిరాజ్‌ సీరియ్‌సగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాలను బెట్టింగ్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేసే ప్రయత్నంలో ఆమె ముందుకెళ్తున్నారు. ఈ కేసులో ఎవరున్నా, ఎందరున్నా వదిలే ప్రసక్తే లేదని, అందరిపై కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారి కుమారుడితో పాటు శాంతినగర్‌కు చెందిన కొందరిని రహస్యంగా విచారించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా ఈ బెట్టింగ్‌ వ్యవహారానికి బాధ్యులైన మిగతా వారందరిపై నేడో, రేపో కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 27 , 2024 | 10:59 PM