Share News

కల్యాణ వైభోగమే..

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:55 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

కల్యాణ వైభోగమే..
ఉత్సవ విగ్రహాలు

కనుల పండువగా సీతారాముల కల్యాణం

చారకొండ, ఏప్రిల్‌ 17: నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ చైర్మన్‌ ఢేరం రామశర్మ స్వామివారికి పట్టువస్త్రాలు, పుస్తె, మెట్టెలు, ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాల మధ్య కల్యాణాన్ని కనుల పండువగా చేశారు. కల్యాణం అనంతరం భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ముక్కిడి పోచమ్మ, మైసమ్మ దేవతలను కూడా దర్శించుకున్నారు. కల్యాణం అనంతరం మండపానికి భక్తులు ఒకేసారి దూసుకురావడంతో భక్తులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భక్తుల కోసం గుట్టపైకి ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం, తాగునీరు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్వకుర్తి డీఎస్పీ వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అంతకముందు ఎస్పీ దంపతులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వారిని ఆలయ చైర్మన్‌ సత్కరించారు.

హాజరైన ప్రముఖులు

సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి దంపతులు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, పోతుగంటి భరత్‌ప్రసాద్‌ కల్యాణాన్ని చూశారు. అనంతరం సీతారమచంద్ర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. వారిని ఆలయ చైర్మన్‌ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండె నిర్మలా విజేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌ కేసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 10:55 PM