Share News

మలేరియా రహిత జిల్లాగా మార్చాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:07 PM

జోగుళాంబ గద్వాలను మలేరియా రహిత జిల్లాగా మార్చేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ అన్నారు.

మలేరియా రహిత జిల్లాగా మార్చాలి
గద్వాల పట్టణంలో ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో శశికళ

- డీఎంహెచ్‌వో శశికళ

- గద్వాల, రాజోలి పట్టణాల్లో వైద్య సిబ్బంది ర్యాలీ

గద్వాల న్యూటౌన్‌/ రాజోలి, ఏప్రిల్‌ 25 : జోగుళాంబ గద్వాలను మలేరియా రహిత జిల్లాగా మార్చేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పాత డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి పాత బస్టాండ్‌ వరకు వైద్య సిబ్బంది నిర్వహించిన ర్యాలీని, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సూచన మేరకు 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా ప్రతీ శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందికి సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములపై తప్పక మూతలు ఉండేలా చూడాలని, ప్లాస్టిక్‌ సంచులు, కప్పులు, గ్లాసులను ఇళ్ల ముందుండే కాలువల్లో వేయరాదని సూచించారు. దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దోమతెరలు వాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ స్రవంతి, డాక్టర్‌ రాజు, సబ్‌ యూనిట్‌ అధికారి శివన్న, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌రెడ్డి, సీసీ వెంకటేష్‌, జిల్లా ప్రోగ్రాం కోఆర్దినేటర్లు శ్యాంసుందర్‌, మక్సూద్‌ పాల్గొన్నారు.

- ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం రాజోలిలో మండల వైద్యాధికారి డాక్టర్‌ మధుబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కొత్త రాజోలి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో రామకృష్ణ, వైద్య సిబ్బంది రంజిత్‌ కుమార్‌, జయప్రకాష్‌, స్టాఫ్‌నర్సు జమున, ఏఎన్‌ఎం మద్దమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:07 PM