Share News

ఉపాధ్యాయుల కొరత తీరేనా?

ABN , Publish Date - May 27 , 2024 | 10:42 PM

జూన్‌ 12 నుంచి 2024-25 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది.

ఉపాధ్యాయుల కొరత తీరేనా?
డిజిట్‌ బోధనను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- సర్కార్‌ బడుల్లో విద్యా బోధనకు తప్పని తిప్పలు

- విద్యావలంటీర్ల నియామకంపై ఆశలు

నారాయణపేట, మే 27 : జూన్‌ 12 నుంచి 2024-25 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను కొన్ని చోట్ల సర్డుబాటుతో నెట్టుకొచ్చారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్యం మూత బడిన పాఠశాలలను సైతం తెరిపించేందుకు క్షేత్ర స్థాయిలో జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. పాఠశాలలు పునర్‌ ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం ప్రత్యామ్నాయంగా విద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రకటించడంతో విద్యా వలంటీర్ల నియామకంపై ఆశలు చిగురించాయి.

జిల్లాలో 513 పాఠశాలలు..

జిల్లా వ్యాప్తంగా 513 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 69,000 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాకు 2,491 ఉపాధ్యాయ పోస్టుల మంజూరిలో 1,982 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. ఇంకా 506 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం 2019-20 విద్యా సంవత్సరం కొవిడ్‌ తర్వాత ఇప్పటి వరకు విద్యా వలంటీర్లను ప్రభుత్వం నియమించలేదు. గత ప్రభుత్వం ఉన్న ఉపాధ్యాయులతోనే సర్దుబాటు చేస్తూ నెట్టుకొచ్చింది.

విద్యారంగంపై కలెక్టర్‌ ప్రత్యేక చొరవ..

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష విద్యారంగంపై ప్రత్యేక చొరవ తీసుకోవడంతో సత్ఫాలితాలు వచ్చాయి. కలెక్టర్‌ జిల్లాలో 98 మంది హెల్ఫర్‌ టీచర్లును నియమించి గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో విద్యా బోధనకు చర్యలు తీసుకున్నారు. హెల్ఫర్‌ టీచర్లుకు కలెక్టర్‌ ఫండ్‌ నుంచి గౌరవ వేతనం చెల్లించారు. దీంతో పదో తరగతిలో రాష్ట్రంలో 15వ స్థానం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పేట జిల్లా 93.13 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. కలెక్టర్‌ చొరవ ఉపాధ్యాయుల సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించారు. ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యార్థులకు వెలుగు అభ్యాసన మిత్ర కార్యక్రమంతో విద్యా సామర్థ్యాల పెంపునకు చర్యలు తీసుకున్నారు. ఇంగ్లిష్‌ బోధన పట్టు కోసం జాలి ప్యానిక్స్‌ కార్యక్రమం ప్రాథమిక పాఠశాల స్థాయిలో చేపట్టారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఏ మేరకు విద్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని విద్యాభిమానులు చర్చించుకుంటున్నారు.

Updated Date - May 27 , 2024 | 10:42 PM