Share News

ఖరీఫ్‌ కష్టమే?

ABN , Publish Date - May 16 , 2024 | 11:25 PM

ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట సాగుచేసేందుకు రైతులు సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నది.

ఖరీఫ్‌ కష్టమే?
ఖరీఫ్‌ సమీపిస్తున్నా గతేడాది వేసిన పంటను తొలగించని రైతులు

- సాగుకు ముందుకు రాని రైతులు

- ఇంకా తెగని కౌలు ధరలు

- గోదాముల్లోనే మిర్చి పంట

- పెట్టుబడికి రైతు చేతిలో డబ్బు లేదు

అలంపూర్‌ చౌరస్తా, మే 16 : ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట సాగుచేసేందుకు రైతులు సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నది. వ్యవసాయ ఖర్చులు భరించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు తృణధాన్యాలు పండించే సమయంలో వ్యవసాయ ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి. కానీ నేటి కాలంలో వ్యవసాయం అంటేనే జూదం ఆడినట్లు అవుతున్నది. పదేళ్లకాలంలో కమర్షియల్‌ పంటలైన మిర్చి, పత్తి సాగువైపు మొగ్గు చూపడంతో ఖర్చులు పెరిగాయి.

తగ్గుతున్న దిగుబడి..

నడిగడ్డ ప్రాంతమైన గద్వాల, ధరూరు, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్‌, అయిజ మండలాల్లో వరి, వేరు శనగ, కంది, మొక్కజొన్న, అముదాలు, పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలు సాగు చేస్తారు. జిల్లాలో దక్షిణం వైపు ఉన్న ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, అలంపూర్‌, ఉండవల్లి మండలాల్లో అక్కడక్కడ వరితో పాటు అధికంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న, కంది, పప్పు శనగ, ఇటీవల పొగాకు పంట సాగు చేస్తున్నారు. రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో అక్కడక్కడా రెండో పంటగా వేరుశనగ, ఎర్రజొన్నలు కూడా పండిస్తున్నారు. జిల్లాలో ఈ పంటలు సాగుచేసే వారిలో దాదాపు 80శాతం మంది కౌలు రైతులే కావడం విశేషం. 2022-23లో మిరప, పత్తి పంటకు డిమాండ్‌ పెరగడంతో కౌలురైతులు భూములు కౌలుకు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఇదే అదునుగా భావించిన భూ యాజమానులు కౌలు ధరలు విపరీతంగా పెంచారు. ఇది కూడా సాగులో ఖర్చు పెరగడానికి ఒక కారణం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది సుమారు 1.70లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఇందులో 1.25 లక్షల్లో కౌలు రైతులే ఉన్నారు. గతేడాది ఎకరం పొలం రూ.30వేల నుంచి రూ.60వేల దాకా వెచ్చించి మిరప పంటను సాగు చేశారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు మిర్చిరైతులు ప్రతీ రెండు రోజులకు ఒకసారి మందులను పిచికారి చేయాల్సి వస్తుంది. దీంతో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నరదాకా ఖర్చు చేశారు. అయినా చివరికి నిరాశే మిగిలింది. వర్షభావ పరిస్థితుల వలన దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పత్తి, మొక్కజొన్న, జొన్న రైతులు లాభాలు చూడకపోయినా నష్టాల నుంచి బయటపడ్డారు. ఇందులో తీవ్రంగా నష్టపోయింది మాత్రం మిర్చిరైతులే. మిర్చి ధరలు తగ్గడంతో భవిష్యత్‌లో ధరలు పెరుగుతాయన్న ఆశతో పండిన పంటను కుడా కోల్డ్‌స్టోరేజీలలో నిలువ ఉంచుకున్నారు. రెండు నెలలు దాటిన ధరల్లో మాత్రం మార్పు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఖరీఫ్‌ ఎలా..? ..

జూన్‌ మాసంలో ఖరీఫ్‌ మొదలవుతుంది. ఇప్పటికే వేసవి దుక్కులు పూర్తి చేయాల్సింది. కానీ చాలా మంది రైతులు పొలం వైపు వెళ్లడంలేదు. నిలువ ఉంచిన మిర్చి పంటను అమ్మితేగాని రైతు చేతిలో నగదు ఉండదు. కౌలు రైతుల వద్ద డబ్బు లేకపోవడంతో సాగుపై ఆసక్తి చూపడంలేదు. గతేడాది చేసిన అప్పులే తీర్చుకోలేదు.. మళ్లీ ఈ ఏడాది పెట్టుబడికి అప్పు ఎలా పుడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కౌలు రైతులకు రైతుబంధు అమలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 16 , 2024 | 11:25 PM