Share News

బడి గంటకు వేళాయో..

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:54 PM

వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఇప్పటి వరకు ఆట పాటల్లో మునిగి తెలిన విద్యార్థులు బధవారం నుంచి బడిబాట పట్టనున్నారు. దాంతో ఇంతకాలం మూగబోయిన స్కూల్స్‌ విద్యార్థులతో సందడిగా మారనున్నాయి.

బడి గంటకు వేళాయో..
గండీడ్‌ మండలం సల్కర్‌పేట ఉన్నత పాఠశాలలో పూర్తి కాని మరుగుదొడ్ల నిర్మాణం

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,187 ప్రభుత్వ స్కూల్స్‌

అరకొర వసతుల మధ్య విద్యార్థులకు స్వాగతం

పూర్తికాని మన ఊరు మన బడి పథకం పనులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 11: వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఇప్పటి వరకు ఆట పాటల్లో మునిగి తెలిన విద్యార్థులు బధవారం నుంచి బడిబాట పట్టనున్నారు. దాంతో ఇంతకాలం మూగబోయిన స్కూల్స్‌ విద్యార్థులతో సందడిగా మారనున్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,187 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మొదటి రోజే విద్యార్థులకు రెండు జతల స్కూల్‌ యూనిఫామ్స్‌ అందజేసేందుకు చాలా స్కూల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఒకటి నుంచి పదోతరగతి వరకు పాఠ్య పుస్తకాలను కూడా అందించనున్నారు.

అరకొర వసతులు

గత ప్రభుత్వం మన ఊరు, మన బడి పథకం కింద పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది, పేద.. బడుగు.. బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. పథకం కింద చేపట్టిన నూతన తరగతి గదుల నిర్మాణాలు ఇప్పటి వరకు కనీసం 30 శాతం కూడా పూర్తవలేదు. దాంతో ఇరుకు గదుల్లో, ఆరు బయటే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వంట గదులు సరిగా లేవు. వంట గదులు లేని చోట ఆరు బయటే వంటలు చేయాల్సి వస్తోంది.

ఉపాధ్యాయుల కొరత

ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు ఉన్నా.. 12,706 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ఆ ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాలలు మూత పడుతున్నాయి. ప్రాథమిక, ప్రాథమిక్నోత పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. ఉన్నత పాఠశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉండగా.. ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంది. లోకల్‌ బాడీ పాఠశాలల్లో మాత్రం అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. గత ఏడాది ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వలంటీర్లను నియమించలేదు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసింది. ఈ ప్రభుత్వమైనా ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ చేసి, నాణ్యమైన విద్య అందేలా చూడాలని సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

వసతులు కల్పించాం

పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా అన్ని వసతులు కల్పించాం. కొన్ని పాఠశాలల్లో మన ఉరు మన బడి కింద చేపట్టిన పనులు పూర్తి కాలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ ప్రారంభం రోజే ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం. నూతన విద్యా సంవత్సరం పండుగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశాం.

- ఎ.రవీందర్‌, మహబూబ్‌నగర్‌ డీఈవో

Updated Date - Jun 11 , 2024 | 10:54 PM