అధ్వానంగా అంతర్గత రోడ్లు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:09 PM
గత పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వల్ల మద్దూర్ రోడ్డు దుస్థితి దయనీయంగా మారింది.

అవస్థలు పడుతున్న పట్టణ వాసులు
మద్దూర్, జూలై 28 : గత పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల ఉదాసీనత వల్ల మద్దూర్ రోడ్డు దుస్థితి దయనీయంగా మారింది. పట్టణంలోని పలు రోడ్లు అధ్వానంగా మారడంతో పట్టణవాసులకు ఇబ్బందిగా మారింది. అసలే అధ్వాన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులకు ఆపై ఎడతెరిపి లేకుండా కురుస్తన్న ముసురు వర్షంతో రోడ్లు మరింత అధ్వానంగా తయారై పాదాచారులు సైతం నడవడానికి ఇబ్బందిగా మారింది. పట్టణంలోని రెనివట్ల క్రాస్‌రోడ్డు, కేకే కాలనీ మార్గం, భాష్యం స్కూల్ మార్గం, కొత్త బస్టాండ్ పరిసర మార్గం, జీపీ రోడ్డు, అమర్‌గడ్డ రోడ్డు, మండల పరిషత్ ప్రధాన మార్గాలు ఇలా పలు రోడ్లు గుంతలమయంగా మారడమే కాకుండా వర్షపు నీటితో కరిగెటను తలపిస్తున్నాయి. దీంతో ఆయా రోడ్డు మార్గాల్లో రాకపోకల సమయంలో వాహన చోదకులు, పాదాచారులు కిందపడి గాయాలు అవుతున్నాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసలు ఇది మండల కేంద్రమేనా? అని కొత్తగా వచ్చే వారు ముక్కున వేలువేసుకోవడంతో అధికారుల తీరుపై మండి పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకొని ఇబ్బందులు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.