Share News

గద్వాల వైద్య కళాశాల తనిఖీ

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:23 PM

గద్వాల మెడికల్‌ కళాశాలను సోమవారం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సభ్యులు తనిఖీ చేశారు.

గద్వాల వైద్య కళాశాల తనిఖీ
ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న ఎన్‌ఎంసీ బృందం

- ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించిన ఎన్‌ఎంసీ సభ్యులు

గద్వాల, జూన్‌ 24 : గద్వాల మెడికల్‌ కళాశాలను సోమవారం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సభ్యులు తనిఖీ చేశారు. ఈ ఏడాది గద్వాలలో మెడికల్‌ కళాశాల ప్రారంభం కానున్నది. అందుకు ఎన్‌ఎమ్‌సీ అనుమతి తప్పనిసరి కావడంతో ముగ్గురు వైద్యులతో కూడిన ఢిల్లీ బృందం ఆసుపత్రికి చేరుకున్నది. అందులో డాక్టర్‌ నవీద్‌ నజీర్‌ షా, డాక్టర్‌ నాగభూషన్‌, డాక్టర్‌ డేవ్‌దివ్యాంగ్‌ నట్వర్‌లాల్‌ ఉన్నారు. ముందుగా వారు గద్వాల ఆసుపత్రిని పరిశీలించారు. వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న సేవలు, ఇన్‌పేషెంట్లు, ఔట్‌ పేషెంట్ల వివరాలను తనీఖీ చేశారు. రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు, క్యాంపుల వివరాలను ఆరా తీశారు. ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని అర్భన్‌ సెంటర్లను తనిఖీ చేశారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన మెడికల్‌ కళాశాలలో తరగతి గదులు, ల్యాబ్‌లు, విభాగాలను తనిఖీ చేశారు. హెచ్‌ఓడీలు, ఫ్యాకల్టీ, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ట్యూటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీసు సబార్డినేటర్ల నియామకం తదితర అంశాలను తెలుసుకున్నారు. కళాశాలకు కావాల్సిన సామగ్రి ఏర్పాటు పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ధరూర్‌ మండల కేంద్రానికి చేరుకొని, హెల్త్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. వారి వెంట వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పార్వతి, సూపరింటెండెంట్‌ నవీన్‌ కాంత్రి, డాక్టర్‌ కిషోర్‌ ఉన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 11:23 PM