Share News

సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకోవాలి

ABN , Publish Date - May 25 , 2024 | 11:16 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ బి.శాంతకుమారి అధికారులను ఆదేశించారు.

సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకోవాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, పక్కన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ రాములు

- జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్‌ శాంతకుమారి

- హాజరైన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 25 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడంతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ బి.శాంతకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఎస్‌జేఆర్‌ పంక్షన్‌హాలులో జడ్పీ చైర్‌పర్సన్‌ బి.శాంతకుమారి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు హాజరయ్యారు. సమావేశంలో బీసీ సంక్షేమం, విద్య, వ్యసాయం, విధ్యుత్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు ఎజెండాలో చేర్చిన అంశాలపై చర్చించారు. శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు గురించి చర్చించారు. పలువురు జడ్పీటీసీ సభ్యులు తమ మండలాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై ప్రశ్నించగా, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌ పర్సన్‌ శాంతకుమారి మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో నాణ్యమైన 24 గంటల విధ్యుత్‌ నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించేలా అవగాహన కల్పించా లని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌కు స్వంత భవనం లేదని, సొంత భవనం కోసం ఏకవాక్య తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీ సింగ్‌, జడ్పీ సీఈవో దేవ సహాయం, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:16 PM