Share News

తీవ్రమవుతున్న నీటి ఎద్దడి

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:36 PM

వర్షాబావ పరిస్థితుల నేపథ్యం లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో గ్రామాల్లో బావులు, బోర్లు ఎండిపోతున్నాయి.

తీవ్రమవుతున్న నీటి ఎద్దడి
ఇటిక్యాలలో చేతిపంపు వద్ద నీరు పట్టుకుంటున్న గ్రామస్థులు

- ప్రత్యామ్నాయ వనరులపై ప్రభుత్వం దృష్టి

- గ్రామాల్లో సర్వే చేస్తున్న కార్యదర్శులు

- చేతి పంపుల మరమ్మతుకు చర్యలు

ఇటిక్యాల, మార్చి 26 : వర్షాబావ పరిస్థితుల నేపథ్యం లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో గ్రామాల్లో బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలలో తాగునీటి ఇబ్బందులు తలెత్త కుండా ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి సారిం చాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. బావులు, చేతిపంపులు తదితర ప్రత్యాన్మాయ వనరుల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామ కార్యదర్శులతో గ్రామాల్లో సర్వే చేయిస్తున్నారు. తాగునీరు అందించే బోర్లు, బావులను గుర్తించి, మరమ్మతులు, ఇతర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని చేతిపంపులను మళ్లీ వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో బోరుబావులే ఆధారం

మండలంలోని ఇటిక్యాల, ఉదండాపురం, పెద్దదిన్నె, షాబాద, చాగాపురం, సాతర్ల, వావిలాల గ్రామాల్లో మిషన్‌ భగీరథ ద్వారా సరిపడినంతగా తాగునీరు అండం లేదు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా తగ్గడంతో పూర్తి స్థాయిలో నీటిని అందించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను గతంలో చేతి పంపులే తీర్చేవి. కాలక్రమంలో అన్ని గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు నిర్మించటం, తెలం గాణ ఆవిర్భావం అనంతరం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించడంతో బోర్ల వినియోగం తగ్గిపోయింది. దీనికి తోడు వాటి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా, వాటి నిర్వహణా బాధ్యతలను గ్రామ పంచాయతీలకే అప్పగించింది. బోర్ల అవసరం పెద్దగా లేకపోవడం, వాటిని పట్టించుకోకపోవడంతో అవి పనికిరాకుండా పోయాయి. ప్రస్తుతం వర్షాభావంతో తాగు నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులు ఏర్పడినందున, ప్రత్యా మ్నాయ వనరుల అన్వేషణలో భాగంగా ప్రభుత్వం మళ్లీ బోరుబావులపై దృష్టి సారించింది. ఇటిక్యాల మండలంలో 29 గ్రామ పంచాయతీల్లో 159 చేతి పంపులు ఉన్నాయి. అందులో 101 బోర్లు పని చేస్తున్నాయి. మరో 58 బోర్లు చెడిపోయాయి. సింగిల్‌ ఫేస్‌ మోటార్‌ ఉన్న బోర్లు 56 ఉండగా, అందులో 42 పని చేస్తున్నాయి. మరో 14 పని చేయడం లేదు. త్రీఫేస్‌ మోటారున్న బోర్లు 41 ఉండగా, ఇందులో 31 పని చేస్తున్నాయి.

గ్రామాల్లో సర్వే చేపడుతున్నాం

వర్షాభావంతో భూగర్బజలం అడుగంటుతోంది. నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అదేశించింది. ప్రత్యామ్నాయ వనరుల అన్వేషణకు సంబంధిత కార్యదర్శులతో యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహిస్తున్నాం. చేతి పంపులు, బావులు ఇతర వనరుల వినియోగంపై నివేదికను రూపొందించి రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు అందిస్తాం. మండలంలో తాగునీటి ఎద్దడి తలెత్త కుండా చర్యలు తీసుకుంటాం.

- అజహర్‌ మొహియొద్దీన్‌, ఎంపీడీవో

Updated Date - Mar 26 , 2024 | 11:36 PM