Share News

పెరిగిన చెంచుల ఓటింగ్‌

ABN , Publish Date - May 16 , 2024 | 11:20 PM

నల్లమలలో చెంచులు క్రమంగా ఓటుకు చేరువవుతున్నారు.

పెరిగిన చెంచుల ఓటింగ్‌
నల్లమలలోని ఆగర్లపెంటలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం చెంచులతో అధికారులు

- చెంచు పెంటల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు

- అధికారుల కృషితో భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం

నాగర్‌కర్నూల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి) : నల్లమలలో చెంచులు క్రమంగా ఓటుకు చేరువవుతున్నారు. దశాబ్దాల తరబడి ఓటు హక్కు వినియోగించుకోవ డానికి దూరంగా ఉన్న చెంచులు క్రమంగా చేరవవు తుండడం గమనార్హం. ఇందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చొరవ కూడా దోహదపడుతోంది. దశాబ్దాల అనంతరం మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న చెంచుల సంఖ్య పెరగడం హర్షణీయం.

ఓటుకు చేరువైన చెంచులు

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు పదివేల చెంచు కుటుంబాలు నివసిస్తున్నాయి. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రెండు దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బలంగా ఉండడంతో బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంలు చెంచుపెంటలకు తీసుకెళ్లడానికి అధికార యంత్రాంగం సాహసించలేదు. అటవీ మార్గాల్లో సరైన రవాణా వసతులు లేకపోవడమూ ఒక కారణమైంది. అప్పా పూర్‌లోని చెంచులు తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాలంటే మన్ననూర్‌, అచ్చంపేట, తెలకపల్లి మీదుగా లింగాలకు వెళ్లాల్సి వచ్చేది. రాజకీయ పార్టీలు కూడా అప్పట్లో చెంచులను వివిధ రవాణా మార్గాల గుండా పోలింగ్‌ బూత్‌లకు తరలించే ప్రయత్నాలు చేయలేదు. సహజం గా పట్టణ ప్రాంత వాతావరణం, అక్కడ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని చెంచులు ఓటు హక్కు వినియోగించు కోవడానికి ఆసక్తి కనబర్చేవారు కాదు.

పెరిగిన ఓటింగ్‌ శాతం

చెంచులు నివసించే ప్రాంతానికే ఈవీఎం లు తరలివెళ్లడంతో వారు ఓటు వినియో గించుకునే శాతం పెరిగింది. అప్పాపూర్‌లో మొత్తం 127ఓట్లు ఉండగా 71 ఓట్లు పోల య్యాయి. రామాపూర్‌ పెంటలో 44 ఓట్లకు గాను 32, భౌరాపూర్‌లో 22ఓట్లకు 17, ఈర్లపెంటలో 75ఓట్లు ఉండగా 40, ఆగర్లపెంటలో 14కు 13, మేడిమలకలలో 41 ఓట్లకు 38, కులాయి పల్లిలో 14 ఓట్లకు 8, సంగడిగుండాలలో 22 ఓట్లకు గాను 18 ఓట్లు పోలయ్యాయి. కొల్లాపూర్‌లోని చెంచుగూడెల్లో కూడా సమీపంగా ఉన్న గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో చెంచులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబర్చారు. కొల్లాపూర్‌ మండలంలోని చెంచుగూడె లల్లో 128 చెంచు కుటుం బాలు నివసిస్తుండగా వీరిలో 320 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా చెంచుగూడెం లోని నివసిస్తున్నందున వారికి ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొల్లాపూర్‌ మండలంలోని అమరగిరి చెంచుగూడెం లో కూడా అడవి బిడ్డలు ఓటు హక్కును వినియోగిం చుకోవడానికి ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నల్లమలలోని పెద్దూటిలో నివసించే చెంచుల కోసం మొలచింతలపల్లి చెంచుగూడెలకు అరకిలో మీటరు లోని సమీప ప్రాంతంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో వారు కూడా ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. లచ్చనాయక్‌ తండా చెంచు గూడెంలో 69 కుటుంబాలు నివసిస్తుండగా 106 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పెద్దకొత్తపల్లి మండలంలో 76 చెంచు కుటుంబాలు ఉండగా 130 మంది ఓటర్లున్నారు. వీరంతా మారేడుమానుదిన్నె, దేవినేని పల్లి, తీర్నాంపల్లి, యాపట్ల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలల్లో మొదటిసారి ఓటు వేశారు.

Updated Date - May 16 , 2024 | 11:20 PM