Share News

ఇల్లే నందనవనం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:34 PM

మొక్కల పెంపకంపై ఆసక్తి.. ఆరోగ్య పరిరక్షణపై దృష్టి.. వెరసి రూపుదిద్దుకున్న అందాల మిద్దె తోట ఇది.

ఇల్లే నందనవనం
మిద్దె తోటలో పెంచిన పూల మొక్కలు

- మిద్దె తోట ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు

- పూలు, కూరగాయ మొక్కల పెంపకం

- రసాయనిక ఎరువులకు దూరం

- ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు

మిద్దెక్కితే పారిజాతం, నందివర్ధనం పూలు పలుకరిస్తాయి. చేమంతి, బంతి, మల్లెలు, గులాబీలు తమనీ చూడమంటాయి. జామ, దానిమ్మ చెట్లు పండ్ల రుచి చూడమంటాయి. బెండ, మిరప, టమాట ఇలా ఎన్నో కూర గాయలు, ఆకుకూరలు కనిపిస్తాయి. నారాయణపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎస్‌.విశ్వనాథ్‌ తన ఇంటి మిద్దెపై సేంద్రియ పద్ధతిలో పెంచిన తోట అందాలివి..

- నారాయణపేట రూరల్‌ (ఆంధ్రజ్యోతి)

మొక్కల పెంపకంపై ఆసక్తి.. ఆరోగ్య పరిరక్షణపై దృష్టి.. వెరసి రూపుదిద్దుకున్న అందాల మిద్దె తోట ఇది. ఆ ఇంటి యజమాని ఎస్‌.విశ్వనాథ్‌. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆయన దామరగిద్ద మండలంలోని కాన్‌కుర్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తన అభిరుచికి వేదికగా ఇంటినే ఎంచు కొని, నందనవనంగా మార్చారు. మొక్కల పెంపకానికి రసాయనిక ఎరువులను వినియోగించ కుండా, సేంద్రీయ ఎరువులను వాడుతున్నారు. పూలమొక్కలను పెంచడంతో పాటు, పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు.

ప్రస్తుతం మిద్దె తోటలో 250కి పైగా మొక్కలు న్నాయి. పూల మొక్కలైన పారిజాతం, నందివర్ధనం, గోవర్ధనం, గన్నేరు, దేవ గన్నేరు, చేమంతి, బంతి, జర్మన్‌ బంతి, నిత్య మల్లెలు, గులాబీలు, హజారీమోగ్ర, లిల్లీ, సత్యనారాయణ పూలతో పాటు గోరింట చెట్టును కూడా మిద్దెపై పెంచారు. అలాగే దానిమ్మ, జామ, అరటి పళ్ల మొక్కలు, బెండ, వంకాయ, మిరప, టమాట, బూడిద గుమ్మడి తదితర కూరగాయల మొక్కలు కూడా ఉన్నాయి. తులసి, కలబంద, రణపాల, గగ్గర పత్తి వంటి ఔషధ మొక్కలు, బ్రహ్మకమలం వంటి అరుదైన మొక్క లను పెంచారు. అలాగే తమలపాకు, మనీ ప్లాంట్‌ వంటి తీగ మొక్కలు మిద్దె తోటకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఆరేళ్లుగా మిద్దెతోట నిర్వహణ

పాఠశాలలో విద్యార్థులకు ఇష్టంగా బోధించే ఆయన, మొక్కలను కూడా అంతే ప్రేమతో పెంచుతున్నారు. దాదాపు ఏడేళ్లుగా మిద్దెపైనే కాకుండా ఇంటి ఆవరణలోనూ పలు మొక్కలను నాటి, శ్రద్ధతో పెంచుతూ ప్రకృతిపై తన ప్రేమను చాటుతున్నాడు. ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూనే, ఉదయం, సాయంత్రం వేళల్లో తన భార్య శ్రీవిద్య సహకారంతో ప్రతీ రోజు మూడు గంటల సమయాన్ని మొక్కల సంరక్షణకు కేటాయిస్తున్నారు. మొక్కల పెంపకానికి సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అందుకోసం ఆయన మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవులు, ఎద్దుల పేడతో పాటు వాటి మూత్రాన్ని వాడుతున్నాడు. ఇంట్లో టీ చేసిన తర్వాత మిగిలే పొడిని, కూరగాయాల వ్యర్థాలను ఎరువుగా మార్చి వినియోగిస్తున్నారు. ఇలా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో తాను స్వయంగా పండించిన కూరగాయలనే ఇంట్లో వంటకు వినియోగిస్తున్నారు.

మొక్కల పెంపకం నా హాబీ

మా ఇంటి ఆవరణతో పాటు, మిద్దెపై ఆరేళ్ళుగా మొక్కలు పెంచుతున్నాను. మొక్కలంటే నాకు చాలా ఇష్టం. పాఠశాల సమయం తర్వాత మొక్కలకు నీరు పోయడం, వాటిని సంరక్షించడం నాకు సరదా. నా భార్య శ్రీవిద్య అందుకు ఎంతో సహకరిస్తున్నారు.

- సగర్‌ విశ్వనాథ్‌

Updated Date - Oct 25 , 2024 | 11:34 PM