Share News

ముంపు బాధితుల గోడు పట్టించుకోరూ!

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:50 PM

ఉన్న ఇళ్లు కూలిపోతున్నాయి.. కొత్త ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి.. పునరావాస కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియదు.

ముంపు బాధితుల గోడు పట్టించుకోరూ!
శిథిలావస్థకు చేరిన ఇల్లు

- అధికారుల నిర్లక్ష్యంతో పునరావాస కేంద్రాల ఏర్పాటులో జాప్యం..

- దుర్భరంగా మారిన బతుకులు

మక్తల్‌, మార్చి 24 : ఉన్న ఇళ్లు కూలిపోతున్నాయి.. కొత్త ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి.. పునరావాస కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. మక్తల్‌ మండలం అనుగొండ, అంకెన్‌పల్లి, దాదన్‌పల్లి గ్రామాలను గత 2007లో ముంపు గ్రామాలుగా గుర్తిస్తూ అప్పటి పాలకులు జీవో జారీ చేశారు. ఈ గ్రామాలకు జూరాల బ్యాక్‌ వాటర్‌ అత్యంత సమీపంలో ఉన్నాయి. వర్షాకాలంలో భారీ వరదలు వస్తే ఇంటి ముంగిట్లోకి నీరు చేరుతోంది. ఇక పాములు, తేళ్లు, విష సర్పాల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి వారిది. ఈ ముంపు గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మించాల్సిన పాలకులు కాలయాపన చేస్తున్నారే తప్ప పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కనీసం స్థల సేకరణ కూడా చేపట్టడం లేదు. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో తమ జీవనం దుర్భరంగా మారిందని ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలో అయినా తమకు మేలు జరుగుతుందేమో అని ఆశపడుతున్నారు. ఏళ్ల కాలంగా గత ప్రభుత్వం పునరావాస కేంద్రాల ఏర్పాటుకు స్థల సేకరణ చేయడం, ఇండ్ల నిర్మాణానికి, గుడి, బడి వంటి వాటి ఏర్పాటు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉండగా భూత్పూర్‌ రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న భూత్పూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించి జీవో విడుదల చేశారు. కాగా అక్కడ అక్రమ షెడ్‌లు పుట్టగొడుగుల్లా వెలియడంతో రీ సర్వే చేపట్టాలని పరిహారం అందించకుండా ఆపేశారు. ముంపు గ్రామాల గోడు పట్టని గత సర్కారుపై బాధితులు శాపనార్థాలు పెట్టారు. తాము నివసించే గ్రామాల్లోని ఇండ్లు శిథిలమైపోతున్నా కొత్త ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాలకు పునరావాస జీవో వచ్చి 15 ఏళ్లు దాటినా అతీగతీ లేదు. ఈ విషయంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని, ముంపు గ్రామాల నిర్వాసితులకు తక్షణమే ఆర్‌ఆర్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలో సంగంబండలో ఈనెల 14న నిర్వహించిన ‘ప్రజాదీవెన’ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ అనుగొండ, అంకెన్‌పల్లి, దాదన్‌పల్లి గ్రామాలకు త్వరలో నిధులు విడుదల చేసి, ఆర్‌ఆర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వాటికి శ్రీహరి కూడా త్వరలో ముంపు బాధితులకు పరిహారం అందించి, ఆర్‌ఆర్‌ సెంటర్లు ఏర్పాటుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 10:50 PM