Share News

గంజాయి, డ్రగ్స్‌ వాడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:13 PM

యువత గంజాయి, డ్రగ్స్‌ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీస్‌శాఖపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ స్పష్టం చేశారు.

గంజాయి, డ్రగ్స్‌ వాడితే కఠిన చర్యలు
ర్యాలీలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, జూపల్లి అరుణ్‌ తదితరులు

- నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

- డ్రగ్స్‌, గంజాయి మహమ్మారిపై కదం తొక్కిన విద్యార్థి, యువత

కొల్లాపూర్‌, ఆగస్టు 24 : యువత గంజాయి, డ్రగ్స్‌ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీస్‌శాఖపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ స్పష్టం చేశారు. కొల్లాపూర్‌లో రత్నగిరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘గంజాయి, డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం’ అంటూ నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, రత్నగిరి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ జూపల్లి అరుణ్‌, ఎక్సైజ్‌ జిల్లా సూపరింటెండెంట్‌ గాయత్రిలు హాజరయ్యారు. వివి ధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు, యువత కలిసి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఆర్డీవో కార్యాలయం ముందు ర్యాలీని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, రత్నగిరి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ జూపల్లి అరుణ్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ముందు భాగంలో డ్రగ్స్‌, గంజాయి మహమ్మారి వేషధారణ చూపరులను ఆకట్టుకుంది. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్‌ చౌరస్తాలో రత్నగిరి ఫౌండేషన్‌ కన్వీనర్‌ కేతూరి ధర్మతేజ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వేదిక దగ్గర సెయింట్‌ జోసెఫ్‌ విద్యార్థులు డ్రగ్స్‌ మహమ్మారిపై చేసిన ప్రదర్శన విద్యార్థులను ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా విద్యార్థులను ద్ధేశించి ఎస్పీ మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని, జిల్లాలో దీనిపై స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని, దొరికితే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రత్నగిరి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ జూపల్లి అరుణ్‌ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయ త్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు. డీఎస్పీ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సూపరిం టెండెంట్‌ గాయత్రి మాట్లాడుతూ యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని సూచించారు. అనంతరం డ్రగ్స్‌, మహిళల రక్షణపై చిన్నారి అలేఖ్య పాడిన ర్యాప్‌సాంగ్‌ ఆలోచింపజేసింది. కొల్లాపూర్‌ సీఐ మహేష్‌ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో డ్రగ్స్‌ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ నాగిరెడ్డి, కొల్లాపూర్‌, కోడేరు, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి ఎస్సైలు హృషికేష్‌, గోకరి, రామన్‌గౌడ్‌, సతీష్‌, ఎక్సైజ్‌ ఎస్సై హనుమంతు, పోలీస్‌ ఎక్సైజ్‌ శాఖల సిబ్బంది, రత్నగిరి ఫౌండేషన్‌ సభ్యులు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, సింగిల్‌ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:13 PM