Share News

పదేళ్లు అధికారంలో ఉండి ఆగం చేసిండ్రు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:09 PM

పదేళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పాలమూరు ఉమ్మడి జిల్లాను ఆభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్‌ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిలు అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి ఆగం చేసిండ్రు
మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డికి కండువా కప్పుతున్న వంశీచంద్‌రెడ్డి

- పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి

మిడ్జిల్‌, ఏప్రిల్‌ 25: పదేళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పాలమూరు ఉమ్మడి జిల్లాను ఆభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్‌ పార్టీ పాలమూరు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిలు అన్నారు. గురువారం మిడ్జిల్‌ మండలం భైరంపల్లి, కంచనపల్లి, సింగందొడ్డి, దోనూరు, బోయిన్‌పల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మీనాంబర పరషువేదీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భైరంపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరును అభివృద్ధి చేస్తామని గత పార్లమెంట్‌ ఎన్నికలలో ఉద్దెర మాటలు చెప్పి గద్దెనెక్కిన నరేంద్రమోదీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పిన తరువాత ఓట్లు అడుగాలని బీజేపీ అభ్యర్థి డీకే ఆరుణను డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజా సంపదను కొల్లగొట్టి ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా ప్రజల నెత్తిన అప్పుభారాన్ని మోపి అడ్డగోలు కూతలు కూస్తున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలతో ప్రజలను, ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసి మరింత అస్తులు కూడబెట్టుకునేందుకు పాలమూరుకు వచ్చిన డీకే ఆరుణకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. పాలమూరు ఆత్మగౌరవాన్ని నరేంద్రమోదీకి తాకట్టు పెట్టకుండా ప్రతీ ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టతను పెంచుకొవాల్సిన అవసరం మనపై ఉందన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

మిడ్జిల్‌, ఉర్కొండ ఉమ్మడి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జడ్చర్ల మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఆంజనేయస్వామి ఆలయ మాజీ చైర్మన్‌ బెక్కరి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ దీపా భర్త గోపాల్‌రెడ్డి, నాయకులు చెల్మారెడ్డి తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గౌస్‌, నాయకులు రాజారెడ్డి, నర్సింహ్మ, నిఖిల్‌రెడ్డి ఉన్నారు.

బీఫాం అందజేసిన కాంగ్రెస్‌ మహిళా నాయకులు

మహబూబ్‌నగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి తరపున అభ్యర్థిత్వ బీఫాం పత్రాలను గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రవి గుగులోత్‌కు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, గద్వాల, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జడ్పీ చైర్‌పర్సన్లు స్వర్ణా సుధాకర్‌రెడ్డి, సరిత తిరుపతయ్య, వనజమ్మలు అందజేశారు.

Updated Date - Apr 25 , 2024 | 11:09 PM