చేనేతకు కరువైన చేయూత
ABN , Publish Date - Dec 18 , 2024 | 11:03 PM
ఆర్థిక భారంతో చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఒకపక్క పెరిగిన రేషమ్ ధరలు, మరోపక్క అందని ప్రభుత్వ సబ్సిడీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఆర్థిక భారంతో నేత కార్మికుల అవస్థలు
అందని సబ్సిడి, పెరిగిన రేషమ్ ధరలు
మార్పులతో మంచి రోజులు రానున్నాయి
అయిజ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక భారంతో చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఒకపక్క పెరిగిన రేషమ్ ధరలు, మరోపక్క అందని ప్రభుత్వ సబ్సిడీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వృత్తిని ఒదులుకోలేక, ధర పెరిగిన రేషమ్ కొనకుండా ఉండలేక పోతున్నారు. నేతనే తమ వృత్తి, జీవనాధారం కూడాను. చీర తయారీకి ఉపయోగించే రేషం ధరలు అమాంతం రూ. 1000 నుంచి 1500 వరకు పెరిగింది. దీనితో నేతన్న కుదేలవుతున్నాడు.
జిల్లాలో 2,695 జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,695 జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు ఉన్నాయి. చేనేత పని, దాని అనుబంధ పనుల్లో దాదాపు మూడు వేలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. అత్యధికంగా రాజోళిలో 700కి పైగా కుటుంబాలు ఉన్నాయి. అయిజ, గద్వాల, ఎక్లాస్‌పూర్, మాచర్ల, గట్టు, అలంపూర్, ఆరగిద్ద గ్రామాల్లో మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఉన్నారు. జిల్లా మొత్తంగా 7,106 మంది కార్మికులు ఉన్నారు. బ్రోకెడ్, బార్డర్, కాటన్, పట్టు, సీకో, పైథానీ, టర్నింగ్ తదితర రకాల చీరలను నేత కార్మికులు నేస్తున్నారు. సామాన్య జీవనం సాగిస్తున్న వీరు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
పెరిగిన ముడి సరకుల ధరలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,240 జియో ట్యాగింగ్ కలిగిన మగ్గాలు ఉన్నాయి. ఈ మగ్గాలపై పట్టు చీరలు, దుప్పట్లు, టవల్స్, కాటన్ క్లాత్ లాంటి వాటిని తయారు చేస్తున్నారు. ఒక మగ్గంపై నెలకు మూడు చీరలు మాత్రమే తయారు అవుతాయి. పట్టు చీరలకు తయారయ్యే రేషం నెల క్రితం రూ. 3,500 ఉండగా ప్రస్తుతం రూ. 5000 దాటింది. వార్పు(పాగడ) రూ. 5000 ఉండగా రూ. 6,000లకు చేరింది. వార్పు, రేషం ధరలు పెరగటంతో చీర తయారీ ధరలు సైతం పెరగాల్సి వస్తోంది. ఒక్కో చీరపై రూ.1,100 నుంచి రూ. 1,700 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తూ నేతన్నలు భయపడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి పెరుగుతున్న చీర తయారీ ముడి సరకుల ధరలకు కళ్లెం వేయాలని నేత కార్మికులు కోరుతున్నారు.
చేనేతకు చేయూత కరువు
చేనేతకు ప్రభుత్వ చేయూత కరువయ్యింది. అందించాల్సిన రాయితీ(సబ్సిడీ)ఇవ్వక పోవటంతో అధిక భారం పడి ఆర్థిక ఇబ్బందులతో సతమతం కావాల్సి వస్తోంది. ఈ ముడి సరకుల కొనుగోలుపై గత ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందించేది. దీని కారణంగా ధరలు పెరిగినప్పటికి కార్మికులకు పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు. ఇందులో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం కార్మికుడు చెల్లిస్తుండటంతో ఇబ్బంది అనిపించేది కాదు. ప్రస్తుత ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వక పోవటంతో మొత్తాన్ని కార్మికుడే భరించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 15 శాతం సబ్సిడీ గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవటం, అవగాహన లేకపోవటంతో అటువైపు ఎవరూ వెళ్లటం లేదు. దీనికి సంబంధించిన జీఎస్టీ బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వస్తుండటంతో ఎవరూ కూడా ఇటు వైపు చూడటం లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 15 శాతం సబ్సిడీపై అవగాహన లేకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం అందించే 40 శాతం సబ్సిడీకి ప్రస్తుతం స్వస్తి చెప్పటంతో నేతన్నలు రేషం కొనుగోలుపై ఆర్థికంగా చితికిపోతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
- చేనేత, జౌళి శాఖ జిల్లా ఏడీ గోవిందయ్య
రాష్ట్ర ప్రభుత్వం అందించే ముడి సరకుల కొనుగోలు సబ్సిడీ విషయం సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది. చేనేత కార్మికులకు జరగాల్సిన మంచి అంతా త్వరగా జరుగుతుంది. కార్మికులు దిగులు చెందాల్సిన పని లేదు.