Share News

గ్రూప్‌-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 30 , 2024 | 10:58 PM

జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను వన పర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు.

గ్రూప్‌-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మే 30 : జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను వన పర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఐడీవోసీ కాన్ఫరెన్స్‌ హాల్లో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ సన్నద్ధతపై అధికారులతో వెబెక్స్‌ ద్వారా మీటింగ్‌ నిర్వహించారు. జిల్లాలో 4,843 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఇందుకు 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. 144 సెక్షన్‌ అమలు, జిరాక్స్‌ కేంద్రాల మూసివేత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించమన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి బయో మెట్రిక్‌ హాజరు తీసుకుంటారని అభ్యర్థులు ప్రతీ ఒక్కరు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవాలని తెలిపారు. బయోమెట్రిక్‌ హాజరు కాని విద్యార్థుల ఓఎంఆర్‌ షీట్‌ పరిగణనలోకి తీసుకోబడదని సూచించారు. అభ్యర్థులు ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరిశీలించుకోవాలని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రానికి చేరుకునే విధంగా ఉదయం ఎనిమిది నుంచి 9:30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు రూట్‌ వారీగా నడపాలని సంబంధిత శాఖను ఆదేశించారు. అభ్యర్థులు ఏ విధమైన ఎలక్ర్టానిక్‌ పరికరాలు వెంట తీసుకురావడానికి అనుమతి లేదని, సెల్‌ఫోన్‌, గడియారం, ఆభరణాలు, పరీక్ష ప్యాడ్‌, లూజు పేపర్లు, బ్యాగ్‌, లాగార్థం బుక్‌, చార్ట్‌ వంటి ఎలాంటి పరికరాలు పరీక్ష కేం ద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. అభ్య ర్థులు బూట్లు కాకుండా చెప్పులు వేసుకుని రావా లని సూచించారు. పకడ్బందీగా చెక్‌ చేయడానికి పోలీస్‌ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వ హించాలని, తాగు నీరు, ప్రథమచికిత్స కిట్లను అన్ని పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం వివరాలు లేదా విద్యార్థుల సందేహాలు, సమస్యలు పరిష్కరించేం దుకు జూన్‌ 8, 9వ తేదీల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌ 08545 - 233525కు ఫోన్‌ చేసి సమాచారం తీసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో పోలీస్‌ నోడల్‌ అధికారి డీఎస్పీ కృష్ణకిశోర్‌, రీజనల్‌ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌, వెబెక్స్‌ ద్వారా ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి..

కొత్తకోట : జిల్లాలో నిర్మిస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్మాణాలను వచ్చేనెల ఎనిమిదవ తేదీ నాటికి పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు. గురువారం కొత్తకోట మండలంలోని ఈదలబావి తండాలో నిర్మిస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులతో పాటు, కొత్తకోట, సంకిరెడ్డిపల్లి గ్రామా ల్లో పాఠశాలల విద్యార్థుల యూనిఫాం కుట్టు కేం ద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థుల యూనిఫాంలు తయారు కావాలన్నారు. ఎప్పటికప్పుడు మండల అధికారులు పర్యవేక్షించి పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో రవీంద్రబాబు, ఎంఈవో కృష్ణయ్య తదితరులున్నారు.

Updated Date - May 30 , 2024 | 10:58 PM