Share News

ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:50 PM

ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలమని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
చాగదోణ ఉన్నత పాఠశాలలో విద్యార్థితో పాఠం చదివిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- చాగదోణ, మాచర్ల, గట్టులలో పర్యటన

- ఉన్నత, గురుకుల పాఠశాలల తనిఖీ

- హిందీ, ఇంగ్లీష్‌ పాఠాలు చదివించిన కలెక్టర్‌

- బోర్డుపై రాసిన వాక్యాలను చదువలేకపోవడంతో అసహనం

గట్టు, ఫిబ్రవరి 20 : ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలమని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. మండల పరిధిలోని చాగదోణ, మాచర్ల ఉన్నత పాఠశాలలతో పాటు, గట్టు గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. చాగదోణ, మాచర్ల ఉన్నత పాఠశాలల్లో పదవతరగతి విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరిశీలించారు. చాగదోణ పాఠశాలలో విద్యార్థులతో ఇంగ్లీష్‌, హిందీ పాఠాలు చదివించారు. కానీ బోర్డుపై రాసిన హిందీ వాక్యాలను ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే చదవడంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇదేం బోధన అని ఉపాధ్యాయులను మందలించారు. కొందరు విద్యార్థులు బడికి రావడం లేదని, కొందరిని తల్లిదండ్రులు పొలం పనులకు తీసుకెళ్తున్నారని వారు కలెక్టర్‌కు వివరించారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలున్నా, ఫలితాలలో మాత్రం జిల్లాలోనే ఆఖరి స్థానంలో ఉందన్నారు. అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులున్నా ఫలితాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గత ఏడాది 27 మంది పదవ తరగతి పరీక్ష రాస్తే, ఏడుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించడమేమి టన్నారు. ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతిలో 27 మంది పరీక్షలు రాయగా ఏడుగురు మాత్రమే ఉత్తీర్ణత సాదిస్తే ఎలా అన్నారు. ఈసారైనా పూర్తి స్థాయి ఉత్తీర్ణత తీసుకరావాలని కలెక్టర్‌ ఉపాధ్యాయులను అదేశించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, విద్యార్థులను ప్రతీ రోజు పాఠశాలకు పంపిం చేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. మాచర్ల ఉన్నత పాఠశాలలో 51 మంది పదవ తరగతి విద్యార్థులున్నారని, అందరూ ఉత్తీర్ణత సాధించాలని ప్రధానోపాద్యాయుడికి సూచించారు. అనంతరం గట్టు బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈవో ఇందిర, రీజినల్‌ కోఅర్డినేటర్‌ ఫ్లోరెన్స్‌రాణి, తహసీల్దార్‌ సరితారాణి, ఎంఈవో కొండారెడ్డి, ఎంపీపీ విజయ్‌, ప్రిన్సిపాల్‌ వాణీదేవి, ప్రత్యేక అధికారి ప్రియాంక, నయాబ్‌ తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీవో చెన్నయ్య, ప్రధానోపాధ్యా యులు నర్సింహులు, రుక్మత్‌బాషా పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

గద్వాల అర్బన్‌ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. క్రీడల్లో పతకాలు సాధించడం ద్వారా భవిష్యత్‌లో ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ వర్తిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియం, తేరు మైదానంలో ఖేలో ఇండియా క్రీడల కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడి క్రీడాకారుల వివరాలు తెలుసుకున్నారు. ఇండోర్‌ స్టేడియంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్టేడియంలో జిమ్‌, షటిల్‌, తైక్వాండో తదితర సదుపాయాలు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండోర్‌ స్టేడియం, తేరుమైదానం క్రీడలకు ఎంతో అనువుగా ఉన్నాయన్నారు. క్రికెట్‌, కరాటే, ఫుట్‌బాల్‌ క్రీడల్లో రాణించిన విద్యార్థులను అభినందించారు. అంతకుముందు ఆయనకు క్రీడల శాఖ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కాసేపు షెటిల్‌తో పాటు క్రికెట్‌ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి (డీఐఎస్‌వో) డాక్టర్‌ బీఎస్‌ ఆనంద్‌, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ జితేందర్‌, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజయ్‌, పీఈటీల అసోసియేషన్‌ జిల్లా అధ్య క్షుడు కృష్ణయ్య, ఖేలో ఇండియా అధికారి జాడే శ్రీనివాసులు, మహిళా పీఈటీల సంఘం అధ్యక్షురాలు హైమావతి, కార్యదర్శి శైలజ, తైక్వాండో రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, శ్రీనివాసులు, అరుణ్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక చొరవ తీసుకోవాలి

పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. గట్టు మండల పరిషత్‌ కార్యాలయంలోని సమావేశమందిరంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవతరగతిలో గత ఏడాది కన్నా ఈ సారి ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలన్నారు. మండలంలో అక్షరాస్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు - మన బడి కింద అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించామని, డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. యూడైస్‌ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలిస్తామన్నారు. చాగదోణ, బోయలగూడెం, మాచర్ల, ఆలూరు, ఇందువాసి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైతే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి గ్రామాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈవో ఇందిర, ప్రత్యేక అధికారి ప్రియాంక, తహసీల్దార్‌ సరితారాణి, ఎంపీడీవో చెన్నయ్య, ఎంఈవో కొండారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:50 PM