Share News

ఆలయాల భూములపై నివేదిక ఇవ్వండి

ABN , Publish Date - May 15 , 2024 | 10:46 PM

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి ఆలయ భూములపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ మానవపాడు తహసీల్దారును ఆదేశించారు.

ఆలయాల భూములపై నివేదిక ఇవ్వండి
మానవపాడు తహసీల్దార్‌ కార్యాలయం

మానవపాడు తహసీల్దారును ఆదేశించిన కలెక్టర్‌

ఎండోమెంట్‌ కమిషనర్‌ సైతం ఆరా

అనుభవదారుల్లో గుబులు

అలంపూర్‌ చౌరస్తా/మానవపాడు, మే 15: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి ఆలయ భూములపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ మానవపాడు తహసీల్దారును ఆదేశించారు. ‘అమ్మకానికి ఆలయాల భూములు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో సదరు దేవాలయాల భూములపై వచ్చిన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. ఎండోమెంట్‌ కమిషనర్‌ కూడా ఆరా తీసినట్లు తెలిసింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆ భూముల అనుభవదారు తన నలుగురు కుమారులపై పట్టా చేసి, అమ్మకానికి సిద్ధం చేశారని వార్త ప్రచురితమైంది. దాంతో బుధవారమే సంబంధిత సర్వే నంబర్‌ 155పై పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. పట్టా మార్పిడి ఏ సంవత్సరంలో జరిగింది?, మార్పిడి వెనుక ఎవరి హస్తం ఉందన్న పూర్తి వివరాలు కోరినట్లు తెలిసింది. దీంతో మానవపాడు రెవెన్యూ కార్యాలయ అధికారులు సదరు ఆలయాల భూముల రికార్డులను పరిశీలించారు. గ్రామ పెద్దలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆలయాల భూములను కాపాడాలని, దేవాలయాల్లో సేవ చేసేందుకు ఎండోమెంట్‌ శాఖకు తమ పూర్వీకులు భూములు ఇచ్చారని గ్రామ పెద్దలు తెలిపారు. భూమిని అనుభవించే వారు టెంపుల్స్‌లో రోజూ మంగళవాయిద్యాలు వినిపించాలనే నిబంధన ఉన్నట్లు గ్రామ పెద్దలు సీతారామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, తిరుమల్‌రెడ్డి, పుల్లారెడ్డి, జ్ఙానేశ్వరరెడ్డి, రాజారెడ్డి, సంపత్‌రెడ్డి తదితరులు రెవెన్యూ అధికారులకు తెలిపారు. భూములపై పూర్తి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించనున్నట్లు మండల అధికారులు చెప్పారు.

ఎండోమెంట్‌ శాఖ ఆరా

చెన్నిపాడు ఆలయాల భూముల బాగోతంపై దేవాదాయశాఖ ఆరా తీసినట్లు జిల్లా శాఖ అధికారులు తెలిపారు. భూములను పరిశీలించి నివేదిక కోరారని శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరి తెలిపారు. అనుభవదారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని చెప్పారన్నారు. రెవెన్యూ అధికారులకు తమ వద్ద ఉన్న ఆధారాలు ఇస్తామని, పట్టామార్పిడికి కారణాలను విశ్లేషించాల్సి ఉందని అన్నారు.

Updated Date - May 15 , 2024 | 10:46 PM