Share News

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Feb 25 , 2024 | 10:56 PM

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆట పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట టౌన్‌, ఫిబ్రవరి 25 : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళ సాధికారత ఆధ్వర్యంలో జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో బేటీ బచావో బేటీ పడావో పథకం అమలులో భాగంగా బడి బయట, ఓపెన్‌ స్కూల్‌లోని అమ్మాయిలకు ప్రాజెక్టు వారిగా ఆదివారం పేట క్రీడా మైదానంలో ఆట పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించి, మాట్లాడారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలని, చదువుకుంటేనే సాధికారత సాధించగలం అన్నారు. బడి మానేసిన అమ్మాయిలను కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో చదివించడం, జిల్లా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 287 మంది అమ్మాయిలను ఓపెన్‌ స్కూల్‌లో చేర్పించడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, జిల్లా యువజన క్రీడాశాఖ వెంకటేష్‌, కౌన్సిలర్‌ సలీం, మహిళా సాధికారత కేంద్రం సమన్వయ కర్త నర్సింహులు, సదా శివారెడ్డి, పీఈటీ వెంకటప్ప, రాజశేఖర్‌, శ్రీలత, రఘు, సాయినాథ్‌, నరసింహా, విజయ్‌, అనిత, నరేష్‌, రేణుక పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

నారాయణపేట : పొట్ట కూటి కోసం దుబాయ్‌కి వెళ్లి అక్కడి ఏజెంట్‌ మోసానికి బలై రష్యా ప్రైవేటు సైన్యంలో పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న పేటకు చెందిన మహమ్మద్‌ సోఫియాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ఆదివారం సోఫియాన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సోఫియాన్‌ ఇంటికి తిరిగొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు సలీం, సరిత సతీష్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సదా శివారెడ్డి, మహిమూద్‌ ఖురేషి, ఆజీమ్‌, బోయ శరణప్ప, యూసూఫ్‌ తాజ్‌ ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 10:56 PM