Share News

పట్టణంలో చెత్త సేకరణ ప్రైవేటుపరం

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:02 PM

ఇంటింటికీ వెళ్లి పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించే పనిని మునిసి పల్‌ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు.

పట్టణంలో చెత్త సేకరణ ప్రైవేటుపరం
మునిసిపల్‌ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లు, సహాయకులు (ఫైల్‌)

- ఆటో డ్రైవర్ల తొలగింపు

- అభద్రతలో పారిశుధ్య కార్మికులు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 13 : ఇంటింటికీ వెళ్లి పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించే పనిని మునిసి పల్‌ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇప్పటివరకు మునిసిపాలిటీకి చెందిన కార్మికులు చేస్తున్న పని, ఇక నుంచి ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో కొనసాగించనున్నారు. వివిధ కారణాలతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్ణయం గత నెలలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్‌ పర్యవేక్షణలో జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో చెత్త సేకరణ పనిని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇందుకోసం ప్రతీ ఇంటి నుంచి నెలకు కొంత సొమ్మును వసూలు చేయాలన్నది నిబంధనగా పేర్కొన్నారు. వాస్తవానికి నూతన మునిసి పల్‌ చట్టం-2021లో పేర్కొన్న నిబంధనల మేరకు పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించే పనిని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాల్సి ఉన్నా ఇప్పటి వరకు గద్వాలలో అమలు చేయలేదు. చెత్త సేకరణ కోసం ప్రతీ ఇంటి నుంచి ప్రతీ నెల కొంత సొమ్మును వసూలు చేయాలనే నిబంధనతో ప్రజలపై ఆర్థికభారం మోపడం వల్ల వ్యతిరేకత వస్తుందన్న కార ణంతో పాటు, ఇప్పటివరకు మునిసిపల్‌ కార్మికుల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుందన్న అంచనాతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఏడాది క్రితం నుంచి పట్టణ పరిధిలోని 37 వార్డులకు గాను ఏడు వార్డుల్లో మాత్రమే కొత్త చట్టాన్ని అనుసరించి చెత్త సేకరణ కొనసాగిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం అన్ని వార్డు లకు వర్తింపజేశారు.

ఆటో డ్రైవర్ల ఆందోళన

స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేందుకు మునిసిపల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం 19 కొత్త ఆటోలను కొనుగోలు చేశారు. ఇందుకోసం తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లను, సహాయకులను నియమించుకుని కార్యక్రమాన్ని కొనసాగి స్తున్నారు. చెత్త సేకరణ పనిని ప్రైవేటు పరం చేస్తూ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయంతో ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆటో డ్రైవర్లు, సహాయకులను తొలగించారు. దీంతో ఆందోళనకు గురైన కార్మికులు ఇటీవల మునిసిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. దాదాపు మూడేళ్లుగా పని చేస్తున్న తమ భవిష్యత్తు ప్రశ్నార్థమైందని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరితో పాటు పారిశుధ్య విభాగంలో పనిచేసే ఇతర కార్మికులు కూడా తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతుండటం గమనార్హం. మునిసిపాలిటీలో కేవలం 30 మాత్రమే రెగ్యులర్‌ పారిశుధ్య కార్మికులున్నారు. 150 మంది ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారు.

కార్మికులకు న్యాయం చేయాలి

పారిశుధ్య కార్మికులకు న్యాయం చేయాలి. రెండున్నర్ర ఏళ్లుగా ఆటో డ్రైవర్లుగా కొనసాగతున్నవారిని అర్ధాంతరంగా తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు చెత్తసేకరణ కోసం ప్రతీ ఇంటి నుంచి రుసుము వసూలు చేయడం అనేక కుటుంబాలకు ఆర్థికంగా భారమే. ఇలాంటి నిర్ణయాల వల్ల భవిష్యత్‌లో పారిశుధ్య నిర్వహణ సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని అధికారులు విరమించుకోవాలి. తొలగించిన డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, పీఎఫ్‌ సొమ్మును వెంటనే ఇవ్వాలి

- వీవీ నరసింహ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాం

కొత్త మునిసిపల్‌ చట్టం ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో చెత్త సేకరణ పనులు ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే నడుస్తున్నాయి. గద్వాల పట్టణంలోనూ అదే నిర్ణయం జరిగింది. మునిసిపాలిటీకి ఆర్థిక భారం కాకుండా, అదే సమయంలో ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలను అందించడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలి.

- కే.నర్సింహ, మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Feb 13 , 2024 | 11:02 PM