Share News

స్తంభించిన జనజీవనం

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:24 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షం ముంచెత్తింది.

స్తంభించిన జనజీవనం
అలంపూర్‌ : ప్రభుత్వ కళాశాల చుట్టూ నిలిచిన వరద నీరు

- భారీ వర్షానికి జలమయమైన రోడ్లు, కాలనీలు

- పిడుగుపాటుకు మహిళ మృతి

మహబూబ్‌నగర్‌/అలంపూరు/వెల్దండ/ ఉప్పునుంతల, జూన్‌ 6 : ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షం ముంచెత్తింది. గురువారం మధ్యాహ్నం కురిసిన వానకు పాలమూరులో జనజీవనం స్తంభించిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. వాతావరణం మేఘావృతమవడంతో చీకటి అలుముకున్నది. మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వానతో మినీ ట్యాంక్‌బండ్‌ రహదారి వర్షపు నీటితో నిండి నీరు ఫుట్‌పాత్‌పైకి చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. అలంపూరు పట్టణంలో అక్బర్‌ పేట కాలనీలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పశువుల కోసం ఏర్పాటు చేసుకున్న గడ్డివాముల చుట్టూ నిలిచాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల చుట్టూ నీరు చేరడంతో దీవిని తలపించింది. కళాశాల ప్రాంగణం పూర్తిగా జలమయమైంది. వెల్దండ మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో గురువారం పిడుగుపాటుకు గురై కొమ్మరెక్క జంగమ్మ (45) మృతి చెందగా, ఆమె భర్త కృష్ణయ్య గాయపడ్డాడు. కృష్ణయ్య తన భార్య జంగమ్మ, అత్త జంగిలి ఈదమ్మతో కలిసి తన వ్యవసాయ పొలంలో పత్తిగింజలు నాటుతుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో జంగమ్మ అక్కడికక్కడే మృతిచెందగా భర్త కృష్ణయ్య గాయపడ్డాడు. అత్త తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకుంది. మృతురాలిని పోస్టుమార్డం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, కృష్ణయ్యను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉప్పునుంతలలో సూరం రాజేందర్‌రెడ్డి బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దును కట్టేశారు. రాత్రి కురిసిన గాలి వానలలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ.60 వేల విలువ ఉంటుందని బాధితుడు వాపోయాడు.

అలంపూరులో ఎత్తిపోయని మోటార్లు..

ఎత్తిపోతల ద్వారా వరద నీరు, మురుగు నీటిని ఎత్తి పోసే మోటార్లు పనిచేయకపోవడంతో వీధులలో నీరు నిలుస్తోందని, ఇళ్లలోకి నీరు చేరుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు వివరించినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్యలను దృష్టిలో ఉంచుకుని త్వరగా పరిష్కరించాలని చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:24 PM