Share News

అభయారణ్యం నుంచి జనంలోకి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:34 PM

నల్లమల అటవీప్రాంతంలో జంతు జనాభా పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలోనే పులుల సంతతి ఎక్కువ పెరుగుతున్న ప్రాంతాల్లో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కూడా ఉన్నది. ఎన్‌టీసీఏ యాక్టు 2008 ప్రకారం పులులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి జనావాసాలు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు పులుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అభయారణ్యంలో అడవిని నమ్ముకొని జీవినం కొనసాగిస్తున్న చెంచులు, ఇతరులకు ప్రాణసంకటంగా మారింది.

అభయారణ్యం నుంచి జనంలోకి
పునరావాసంలో భాగంగా తరలించనున్న సార్లపల్లి గ్రామం

అడవిని వీడేందుకు సిద్ధమవుతున్న నల్లమల గిరిజనులు

పులులు, ఇతర జంతు సంరక్షణ కోసం పునరావాస పథకం

రూ.15 లక్షలు నగదు లేదా ఐదు ఎకరాల భూమి, ఇల్లు, వసతులు

మొదటి దశలో 417 కుటుంబాల తరలింపు

ఎలివేటెడ్‌ హైవే నిర్మాణానికీ ఉపయోగకరం

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నల్లమల అటవీప్రాంతంలో జంతు జనాభా పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలోనే పులుల సంతతి ఎక్కువ పెరుగుతున్న ప్రాంతాల్లో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కూడా ఉన్నది. ఎన్‌టీసీఏ యాక్టు 2008 ప్రకారం పులులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి జనావాసాలు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు పులుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అభయారణ్యంలో అడవిని నమ్ముకొని జీవినం కొనసాగిస్తున్న చెంచులు, ఇతరులకు ప్రాణసంకటంగా మారింది. జంతు జనాభా పెరుగుతుండటంతో అడవిలో సాగు చేసిన పంటలు కూడా దక్కడం లేదు. నిత్యం కాపలా ఉన్నా పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. అటు జంతు సంరక్షణతో పాటు.. ఇటు గిరిజనుల పునరావాసం కోసం ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) అడుగులు వేయగా ఒకప్పుడు వ్యతిరేకించిన చెంచులు, ఇతరులు ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో పునరావాసం కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పునరావాసం కింద అర్హత పొందిన వారి జాబితా తయారు చేసిన అటవీ శాఖ అధికారులు వారికి రెండు ఆప్షన్లు చూపించారు. మొదటి ఆప్షన్‌ కింద 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి రూ. 15 లక్షలు టోకెన్‌ అమౌంట్‌.. రెండో ఆప్షన్‌ ఐదెకరాల భూమి, అన్ని వసతులు ఏర్పాటు చేసిన కాలనీలో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నారు. మొదటి దశలో సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాల పెంట, కొల్లంపెంట గ్రామాల్లోని 417 కుటుంబాలను తరలిస్తారు. ఇందులో చెంచులు 107 మంది ఉండగా, చెంచేతరులు 310 మంది ఉన్నట్లు గుర్తించారు. ఎన్‌టీసీఏ పునరావాస పథకం కింద 160 మంది రూ. 15 లక్షలు టోకెన్‌ అమౌంట్‌గా తీసుకుంటామని చెప్పగా, 257 మంది మాత్రం రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నారు. త్వరలోనే ఈ గ్రామాలు ఖాళీ చేయడం ప్రారంభమయ్యే అవకాశాలు ఉండగా అంతకుముందే నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారంలో ఉన్న అటవీశాఖకు చెందిన 4500 ఎకరాల సోషల్‌ ఫారెస్టులో స్థలాలు కేటాయించి కాలనీలను అభివృద్ధి చేయనున్నారు. దసరా తర్వాత బాచారంలో కాలనీ ఏర్పాటు పనులు మొదలు పెట్టనున్నారు. మొదట అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మారుస్తారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు హోల్డ్‌లో పెట్టి ఆ తర్వాత క్రయవిక్రయాలకు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రెండో దశలో వటువర్లపల్లి, కొమ్మెనపెంట వంటి మిగతా గ్రామాలను కూడా తరలించనున్నారు. అయితే సార్లపల్లి గ్రామంలోని 40 మంది చెంచులు ఈ పునరావాసానికి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.

అటవీ, జంతుసంరక్షణ కోసమే..

నల్లమల రాష్ట్రంలోనే అతిపెద్ద అటవీప్రాంతం.. ఇది అరుదైన మొక్కలు, అనేక జంతువులకు ఆలవాలం.. కానీ, అభయారణ్యంలో పెరుగుతున్న జనాభా, అందుకు అనుగుణంగా అటవీ ధ్వంసం.. సాగు భూములు పెరుగుతుండటంతో అటవీ సంపదకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. సాగు కోసం ఏర్పాటు చేసిన కంచెల వల్ల మూగజీవాలు ప్రాణాలను కోల్పోతుండటం.. అటవీ ఉత్పత్తుల సేకరణ కోసమో, లేక పశువుల మేతకో వెళ్లినప్పుడు నిప్పు పెట్టడంతో ప్రతీఏట వేల హెక్టార్లలో అటవీ దహనం అవుతోంది. మానవ తప్పిదాలతో జరుగుతున్న ఈ ప్రమాదాలతో కొన్ని కోట్ల మొక్కలు కాలి బూడిదవుతున్నాయి. దాంతోపాటు వేగంగా పరిగెత్తలేని జంతువులు మంటల్లో మసి అయిపోతున్నాయి. అభయారణ్యంలో ఉన్న గిరిజనులు కూడా పంటల సాగు, వాటిని కాపాడుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉరులు పెట్టడం, కంచె వేయడం, కరెంటుషాక్‌ పెట్టడం, విష ప్రయోగం చేయడం వంటివి గతంలో చేసినా ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటంతో అడవిపందులు, దుప్పులు, కోతులతో నిత్యం కాపలా ఉన్నా, నష్టం జరుగుతూనే ఉన్నది. విద్యా, వైద్యం వంటి వసతులకు కూడా వీరు దూరమవుతున్నారు. ఎన్నాళ్లు సాగుచేసినా అడవీ భూములపై హక్కులు వచ్చే అవకాశం లేదు. అటు అడవీ సంపదను రక్షించడం, ఇటు చెంచులకు మంచి జీవనం అందించడం కోసం ఈ పునరావాస ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఎలివేటెడ్‌ హైవేకు మార్గం సుగమం..

నల్లమల అటవీ ప్రాంతం గుండా జనసంచారం పెరిగిపోతోంది. శ్రీశైలం వెళ్లే వారంతా అటవీ గుండా వెళుతుండటం, మధ్యలో ఆగి మంటలు పెట్టడం, శబ్దాలు చేయడం వంటివి చేస్తున్నారు. అలాగే రాకపోకలు పెరగడం వల్ల జంతువులు రోడ్డు దాటుతూ మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎలివేటెడ్‌ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రతిపాదించారు. గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వీ రమణ కూడా ఇక్కడ ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు అవసరమని కేంద్రానికి సూచించారు . ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం వల్ల కింద జంతు సంచారం సులభంగా జరగడంతో పాటు రాకపోకల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి పాతాలగంగ వరకు ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం దాదాపు 57 కిలోమీటర్ల మేర చేయనున్నారు. మొత్తం రూ. 7500 కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తుండగా అనుమతులు వచ్చిన తర్వాత నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాలి. ఆ సమయంలో కొంత అడవి ధ్వంసం జరిగినా వంద ఏళ్ల వరకు ఇబ్బందులు ఉండవని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా అనుకూలంగా ఉండటంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కచ్చితంగా ఉంది. గ్రామాల తరలింపు వల్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కూడా సులభంగా పూర్తిచేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మంచి జీవనం కోసం ఒప్పుకున్నాం

అమ్రాబాద్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో గిరిజనేతరులకు రాజకీయంగా కానీ.. ఉద్యోగపరంగా కానీ ఎలాంటి హ క్కులు లేవు. మా తాతాల తరం నుంచి పోడు భూములను సాగుచేస్తున్నా ఎటువంటి పట్టాలు రావు. వ్యవసాయం కూడా అడవిలో జంతువుల వల్ల చేయలేకపోతున్నాం. అందుకే మెరుగైన జీవనం. భూములపై హక్కు కోసం ఎన్‌టీసీఏ వారు ఇచ్చే పునరావాసం పొందడానికి అంగీకరించాను.

- పుణ్యమూర్తి విష్ణు, పునరావాస కమిటీ అధ్యక్షుడు, సార్లపల్లి

ఎన్నాళ్లీ అడవిలో బతుకులు

నల్లమల అటవీప్రాంతంలో జీవిస్తున్న చెంచులకు ప్రభుత్వపరంగా సరైన వైద్యం అందడం లేదు. రోగాల బారిన పడి చెంచులు 30 ఏళ్లకే కాటికిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా వైద్యం కూడా లేదు. మేము ఇప్పటికీ అడవుల్లోనే బతుకుతున్నాం. పిల్లలకు చదువు సరిగా ఉండటం లేదు. ఇక్కడి నుంచి పోతే పిల్లల జీవితాలైనా బాగుపడతాయని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాం.

- మండ్లి బౌరమ్మ, మాజీ సర్పంచు, కుడిచింతల బైలు

అడవికి దూరమైతే కాటికి వెళ్లినట్లే

అడవుల్లో ఉన్న గిరిజనులు, గిరిజనేతరులను అధికారులు మైదాన ప్రాంతాలకు తరలించబోతున్నారు. స్వచ్ఛందంగా వెళ్లేవారికి మేము వ్యతిరేకం కాదు. మా గిరిజన కుటుంబాలను ఏ శాఖ అధికారులైనా బలవంతంగా తరలించేందుకు ప్రయత్నిస్తే.. అందరిపైనా న్యాయపోరాటం చేస్తాం. ప్యాకేజీ విషయాలు చెబుతున్నారు. వాటిపై నాకు నమ్మకం లేదు. అడవిని వదిలితే కాటికి వెళ్లినట్లే అని భావిస్తాను.

- చిగుళ్ల మల్లికార్జున్‌, ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌

Updated Date - Oct 25 , 2024 | 11:34 PM