Share News

జాబ్‌ కార్డులకు.. ఆధార్‌ అనుసంధానం

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:40 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి చర్యలు చేపట్టింది.

జాబ్‌ కార్డులకు..  ఆధార్‌ అనుసంధానం

ఉపాధిలో అక్రమాలకు చెక్‌ పెట్టడడమే లక్ష్యం

ఆన్‌లైన్‌లో నమోదైన కూలీలకు వేతనం చెల్లింపు

నారాయణపేట, మార్చి 9 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి చర్యలు చేపట్టింది. పనికి వచ్చే కూలీల హాజరు విషయంలో ఎక్కడా అవకతవకలు జరుగకుండా ఉండేందుకు కూలీల ఫొటోలు తీసి, హాజరు విధానాన్ని అమలు చేసేలా నేషనల్‌ మొబైల్‌ మానిటరి సిస్టమ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా ఉపాధి కూలీల జాబ్‌ కార్డులకు ఆధార్‌ కార్డు అనుసంధానం చేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే కూలీల జాబ్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల నేరుగా కూలీల ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశముంది. ఫొటోలతో పాటు ప్రత్యేక పోర్టర్‌, హాజరు విధానం వల్ల ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉండదు. జిల్లాలోని 13 మండలాల్లో 1,30,486 మంది ఉపాధి కూలీలకు గాను 1,37,409 మంది కూలీల ఉపాధి కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేశారు. ఈ విధానం వల్ల ఎలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఉందదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా మక్తల్‌లో 18,726 ఉపాధి కూలీలకు గాను 18,720 మందికి సంబంధించి ఉపాధి కార్డులకు ఆధార్‌ లింక్‌ పూర్తికాగా, ఆరుగురు మిగిలారు. అత్యల్పంగా కృష్ణలో 4,549 మంది ఉపాధి కూలీలకు గాను అందరి కూలీల ఆధార్‌ పూర్తి కావడంతో వంద శాతం పూర్తైంది. దామరగిద్దలో 13,359 మంది కూలీలకు గాను 13345 మంది కూలిల ఆధార్‌ అనుసంధానం పూర్తైంది. ధన్వాడలో 8,925 కూలీలకు గాను 8,920 కూలీల ఆధార్‌ అనుసంధానం పూర్తి కాగా, కోస్గిలో 10,661 మంది కూలీలకు సంబంధించి 9,985 మంది కూలీల ఆధార్‌ అనుసంధానం పూర్తి అయ్యింది. అదే విధంగా మద్దూర్‌ మండలంలో 17,171 మంది కూలీలకు గాను 17,133 మంది కూలీల ఆధార్‌ అనుసంధానం పూర్తికాగా, మాగనూర్‌లో 7,809 మంది కూలీలకు ఆధార్‌తో అనుసంధానం చేశారు. మరికల్‌లో 7,871 మంది కూలీలు, పేట మండలంలో 16,657 మంది కూలీలు, నర్వలో 8,440 మంది కూలీల ఉపాధి కార్డులను ఆధార్‌తో వంద శాతం అనుసంధానం చేశారు. ఊట్కూర్‌లో 16,319 కూలీలకు గాను 16,315 కూలీల ఆధార్‌ అనుసంధానం చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 10:40 PM