Share News

పశుగ్రాసం కొరత తీవ్రం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:13 PM

ఈ ఏడాది వర్షాభావంతో పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడింది. పశువుల మేతకు వరిగడ్డిని కొనాలంటే, ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది.

పశుగ్రాసం కొరత తీవ్రం
కేటీదొడ్డి సమీపంలోని పొలంలో గేదెలను మేపుతున్న రైతు

- జిల్లాలో గోజాతి పశువులు 79 వేలు, గేదె జాతి పశువులు 59 వేలు

- రూ. 15వేల పైనే ట్రాక్టర్‌ గడ్డి ధర

- పశువులను తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు

కేటీదొడ్డి, ఏప్రిల్‌ 25 : ఈ ఏడాది వర్షాభావంతో పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడింది. పశువుల మేతకు వరిగడ్డిని కొనాలంటే, ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది. అంత డబ్బును గడ్డి కోసం వెచ్చించలేక పలువురు రైతులు తమ పశువులను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. పాడి పశువులకు మేత సరిగాలేక పాల దిగుబడి తగ్గిపోయింది. దీంతో పాడి ఆధారంగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

వర్షాభావంతో సమస్యలు

జిల్లాలో గోజాతి పశువులు 79 వేలు, గేదె జాతి పశువులు 59 వేలు ఉన్నాయి. గొర్రెలు 5.77 లక్షలు, మేకలు 68 వేలు ఉన్నాయి. కేటీదొడ్డి మండలంలో గోజాతి పశువులు 5,701 ఉండగా గేదె జాతి పశువులు 2,550 ఉన్నాయి. అలాగే 42,639 గొర్రెలు, 3,925 మేకలు ఉన్నాయి. ఈ ఏడాది సరైన వర్షాలు పడకపోవడంతో చాలా మంది రైతులు వరి సాగు తక్కువ చేశారు. సాగు చేసిన కొద్దిపాటి వరి కూడా నీళ్లు లేక చాలాచోట్ల ఎండిపోయింది. బోర్లలో నీరు ఉన్న పొలాల్లో కొంత మేర వరి పంట చేతికి వచ్చింది. దీంతో వరిగడ్డికి తీవ్రమైన కొరత ఏర్పడి, డిమాండ్‌ బాగా పెరిగింది. పశువుల మేత కోసం స్థానికంగా వరి గడ్డి అందుబాటులో లేక పోవడంతో రైతులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ట్రాక్టర్‌ వరిగడ్డి తీసుకురావడానికి రూ.15 వేలకు పైగానే ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పశుగ్రాసం కొరతతో ప్రతీ వారం గద్వాల, రాయచూరు, అయిజ, పెబ్బేరులలో జరిగే సంతల్లో పశువులను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు వాటిని మేపేందుకు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

పెరిగిన దాణా ధరలు

పశువుల మేత కోసం గడ్డితో పాటు దాణాను వినియోగిస్తారు. ఈ ఏడాది దాణా ధరలు కూడా పెరగడంతో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పత్తిచెక్క క్వింటాలు ధర రూ.3,200, గానుగచెక్క క్వింటాలు రూ.5,000, తౌడు క్వింటాలు రూ.1,500, పుట్నాల పొట్టు క్వింటాలు రూ.1,200 ఉందని పాడి రైతులు చెప్తున్నారు. వర్షాలు తక్కువ పడడంతో పాటు, ప్రస్తుతం వరి కంటే ఎక్కువగా మిరప, పత్తి, పొగాకు ఇతర ఆరుతడి పంటలను సాగు చేస్తుండడంతో పశుగ్రాసం కొరత మరింత తీవ్రమైంది. దీనికి తోడు ప్రభుత్వం ఈసారి సబ్సిడీపై గడ్డి విత్తనాలను కూడా ఇవ్వకపోవడం వల్ల పాడి రైతులు పచ్చిగడ్డి సాగు చేయలేదు.

గడ్డి విత్తనాలను వేసుకోవాలి

పాడి రైతులు తమ పొలాల్లో గడ్డి విత్తనాలు వేసుకోవాలి. పాడి రైతులకు ప్రభుత్వం ప్రతీ ఏడాది సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేసేందుకు ఈ సారి సబ్సిడీ విత్తనాలు రాలేదు. రైతులను పశువులను అమ్ముకోకుండా, గడ్డి విత్తనాలను సాగు చేసుకోవాలి. పశువుల మేతకు కొరత రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

- డాక్టర్‌ వినయ్‌ కుమార్‌, మండల పశుసంవర్ధకశాఖ అధికారి

రెండు గేదెలను అమ్ముకున్నాను

వరిగడ్డి లేకపోవడం వల్ల పశువుల మేతకు ఇబ్బంది పడ్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వరిగడ్డిని కొనుగోలు చేసి తెచ్చుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాగే దాణా ధరలు కూడా పెరి గాయి. పశువులకు మేత దొరకకపోవడం వల్ల రోజుకు పది లీటర్ల పాలిచ్చే రెండు గేదెలను తక్కువ ధరకు అమ్ముకున్నాను. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల గడ్డి కొరత తీవ్రంగా ఉంది.

- వీరేష్‌, రైతు, కేటీదొడ్డి

Updated Date - Apr 25 , 2024 | 11:13 PM