ఫిర్యాదులపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:14 PM
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ పాల్గొని, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చేసుకుంటున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దని కోరారు. ప్రతీ ఫిర్యాదును క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. బీసీ రెసిడెన్షియల్, పోలీస్, మైనార్టీ, విద్యాశాఖ, హౌసింగ్, రెవెన్యూ, బ్యాకింగ్, డీఆర్డీఏ, పావళా వడ్డీ, మునిసిపాలిటీ తదితర శాఖలతో పాటు వ్యక్తి గత సమస్యల పరిష్కారాలను కోరుతూ ప్రజలు ఫిర్యాదులు చేసుకున్నారని తెలిపారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచిస్తూ దరఖాస్తులపై ఎండార్స్ చేస్తూ ఆయా అధికారులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీఏ నర్సింహులు, ఆర్డీవో నవీన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రతిపాదనలు పంపించండి
మెడికల్, వెటర్నరీ తదితర సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతిపాదనలు పంపించాలని పదేపదే చెప్పినా నిర్లక్షం చేస్తున్నారని ఆయా సంస్థలపై కలెక్టర్ విజయేందిర బోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్థానిక శాసన సభ్యులు ఈ సంవత్సనం ఎన్ని లెటర్లు పంపారు. వాటికి ఎన్ని జవాబులు ఇచ్చారో కూడా ఈ సాయంత్రంలోపు అందజేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మూడు రోజుల్లో జిల్లా మొత్తంలో అన్ని శాఖలకు సంబంధించి వచ్చిన సీఎం జీబీ ఫిర్యాదులు 20, కలెక్టరేట్ జీబీ ఫిర్యాదులు 86 పెండింగ్‌లో ఉన్నాయని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఈ రోజు నాటికి జిల్లాలో 75శాతం పూర్తైందని తెలుపుతూ మండలాల వారిగా సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల మీద ఏ శాఖకు ఏమి వస్తున్నాయన్న ప్రభుత్వ బెనిఫిట్స్ వివరాలు ముఖ్యంగా ఆర్టీసీ లాంటి సంస్థలు ఇవ్వాల్సి ఉందని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు ఈ వారంలోపు గ్రౌండింగ్ కావాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పూర్తైన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు పంపాలని సూచించారు.
స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పని కల్పించాలి
మహిళలందరికీ కూడా వేధింపులు లేని మంచి స్వేచ్ఛాయుతమైన పని వాతావరణం కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మండల స్థాయిలో మండల నోడల్ ఆఫీసర్లను అపాయింట్ చేసి వారి ద్వారా ఫిర్యాదులను లోకల్ కాంప్లైంట్ కమిటీకి గోప్యంగా అందజేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన లోకల్ కాంప్లైంట్ కమిటీ (ఎల్‌సీసీ) సమావేశంలో మాట్లాడారు. ఈ కమిటీ పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు నివారణ పరిష్కార చట్టం 2013 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సంఘటిత అసంఘటిత రంగాల్లో పది మంది కన్న ఎక్కువ సిబ్బంది ఉంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, కమిటీ లేక పోతే కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమ అధికారిణికి కాంప్లైంట్ అందించాలని లేదా టోల్ నెంబర్ 181 కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం మాస్ మీడియా అధికారిణి మంజుల, డీఆర్డీవో డీపీఎం నాగమల్లిక, ఎంవీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి, ఎన్జీవో గోవర్ధిని, డీవీ సెల్ లీగల్ కౌన్సిలర్ అరుణ పాల్గొన్నారు.