మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:11 PM
రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాడ్ యం త్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 3 : రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాడ్ యం త్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేఽశించిన మార్గదర్శకాల ప్రకారం ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వ హించామన్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని 594 పోలింగ్ కేంద్రాలకు ఆన్‌లైన్ ద్వారా ఈవీఎంలను కేటాయించి నట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గానికి 378 కంట్రోల్ యూనిట్లు, 378 బ్యాలెట్ యూనిట్లు, 424 వీవీ ప్యాట్లు, అలంపూర్ నియోజకవర్గానికి 363 కంట్రోల్ యూనిట్లు, 363 బ్యాలెట్ యూనిట్లు, 407 వీవీ ప్యాట్‌లను కేటాయిం చినట్లు చెప్పారు. మొత్తం 741 కంట్రోల్ యూనిట్లు, 741 బ్యాలెట్ యూనిట్లు, 831 వీవీ ప్యాట్ల కేటాయింపు పూర్తయ్యిందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 778 బ్యాలెట్ యూనిట్లు, 751 కంట్రోల్ యూ నిట్లు, 882 వీవీ ప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. మొదటి దశ ర్యాండమైజేషన్‌కు సంబంధించిన హార్డ్‌కాపీలు, సాఫ్ట్‌కాఫీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రామచందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నరేష్, గద్వాల తహ సీల్దార్ వెంకటేశ్వర్లు, అలంపూర్ తహసీల్దార్ మంజుల, వివిధపార్టీల నాయకులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎండ తీవ్రత పెరిగినందున వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం నాలుగు గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఎండలో పని చేయొద్దన్నారు. అల్కహాలు, టీ, కాఫీ, స్వీట్లు, శీతల పానీయాలు తీసుకోవద్దని, ఆరుబయట చెప్పులు లేకుండా నడవొద్దని సూచించారు. చిన్నారులు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలని తెలిపారు. వదులైన దుస్తులను ధరించాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనాలపై సూదూర ప్రయణాలు చేయొద్దని, సూర్య కిరణాలు నేరుగా శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో పనిచేసే కార్మికులు తరుచుగా నీటితో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగాలని చెప్పారు. శరీర ఉష్ణోగ్రత అధికమవడం, అలసట, నోరు ఎండిపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలన్నారు. వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.