Share News

నిప్పు.. భూసారానికి ముప్పు

ABN , Publish Date - May 19 , 2024 | 10:51 PM

నిప్పు.. భూసారానికి ముప్పుగా మారుతోంది.. యాసంగి వరి కోతలు పూర్తికావడంతో వానాకాలం సాగు పనులను రైతులు ప్రారంభించారు.

నిప్పు.. భూసారానికి ముప్పు
పేట కూరగాయల మార్కెట్‌ వద్ద పేరుకుపోయిన చెత్త

అవగాహన లేమితో వరి కొయ్యలను కాలుస్తున్న రైతులు

దిగుబడిపై తీవ్ర ప్రభావం

మరికల్‌, మే 19 : నిప్పు.. భూసారానికి ముప్పుగా మారుతోంది.. యాసంగి వరి కోతలు పూర్తికావడంతో వానాకాలం సాగు పనులను రైతులు ప్రారంభించారు. ఈ క్రమంలో అవగాహన లేకపోవడంతో వరి కొయ్యలకు రైతులు నిప్పు పెడుతున్నారు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రానున్న రోజుల్లో పంటలు పండని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి బిగువుగా మారి, నీటిని పీల్చుకునే గుణాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాల్చిన చోట భూమి సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. దీంతో పాటు పంటలకు తోడ్పాటు అందించే సూక్ష్మ జీవులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది.

ఇలా చేస్తే మేలు

పొలం దున్నె పది రోజుల ముందు గడ్డిని పొలంలో పరిచి నీరందించాలి. తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్‌ పాస్ఫేట్‌ను చల్లాలి. దీంతో భూమిలో సేంద్రియ పదార్థాల స్థాయిని పెంచవచ్చు. ఈ పద్ధతి పాటించడం వల్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి దిగుబడి కూడా పెరుగుతోంది. ఏటా కోల్పోతున్న భూ సారాన్ని వృద్ధి చేసుకునేందుకు పొలాల్లో జనుము, పెసర, జీలుగను సాగు చేయడంతో పాటు సాధ్యమైనంత వరకు రసాయన మందుల వాడకం తగ్గించాలి.

కొయ్యలను తగుల పెట్టకూడదు..

రైతులు పంట కోసిన తర్వాత ఎట్టి పరిస్థితిల్లోనూ కొయ్యలను తగుల పెట్టకూడదు. అలా చేస్తే భూసారం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాం. జీలుగ, పిల్లిపెసర వంటివి సాగుచేయడం వల్ల భూసారం వృద్ధి చెందుతోంది.

- శివకుమార్‌, ఏవో, మరికల్‌

Updated Date - May 19 , 2024 | 10:51 PM