Share News

ఎట్టకేలకు డీఎస్సీ

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:11 PM

రాష్ట్రంలో తొలిసారిగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

ఎట్టకేలకు డీఎస్సీ

- 11,062 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,131 పోస్టుల గుర్తింపు

- గుర్తించిన పోస్టుల కంటే ఉపాధ్యాయ ఖాళీలే అధికం

- మెగా డీఎస్సీ ప్రకటనతో సంతోషంలో అభ్యర్థులు

రాష్ట్రంలో తొలిసారిగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్లుగా అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యా సంబంధిత పోస్టుల భర్తీ పెద్దగా జరగలేదు. గురుకులాల పోస్టులతో పాటు భాషాపండితులు, టీఆర్‌టీలు భర్తీ జరిగినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీకి మాత్రం పెద్దగా శ్రద్ధ చూపలేదు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొందరగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ వేసి.. పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలామంది టీచర్‌ పోస్టులకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులకు కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే ముందు ముందు పార్లమెం ట్‌ ఎన్నికలు ఉండటంతో.. ఆ తర్వాతనే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది.

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ వేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం మొత్తంలో 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటించింది. అయితే ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి 3,100 పాఠ శాలలు ఉన్నాయి. ఇందులో 14,333 టీచర్‌ పోస్టులకు మంజూరు ఉంది. 12,531 పోస్టుల్లో మాత్రమే టీచర్లు ఉన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచడంతో చాలామంది అలాగే విధుల్లో కొనసాగుతు న్నారు. ఈ సంవత్సరం మధ్యలో నుంచి పెంచిన గడువు కూడా పూర్తయితే ఇంకా ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఉమ్మడి పాలమూరు లోని నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కలిపి 1,805 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి మరో ఆరు నెలల్లో పెరిగే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందాల్సిన వారంతా ఇప్పుడు క్యూలో ఉన్నారు. ఇక ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులో 1,131 పోస్టులను తాజాగా విడుదల చేసిన డీఎస్సీలో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలపగా.. ఇప్పుడున్న ఖాళీలే ఇంకా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ పోస్టు లను కూడా దశలవారీగా భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 1,131 పోస్టులు పోను అధికారు ల అంచనాల ప్రకారమే ఇంకా 674 ఖాళీలు ఏర్పడను న్నాయి. అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల్లో చాలావరకు పదోన్నతుల కోసం తీయగా.. మిగిలిన పోస్టులను భర్తీ చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 172 పోస్టులు భర్తీ చేయనుండగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 243, నాగర్‌కర్నూలులో 285 పోస్టులు, నారాయణపేటలో 275 పోస్టులు, వనపర్తిలో 152 పోస్టులు భర్తీ కానున్నాయి.

ఎంఈవోలు ఏరీ..

చాలా ఏళ్లుగా ఉమ్మడి పాలమూరులోని అన్ని మండలాల్లో ఎంఈవోలు లేరు. పలు మండలాల్లో సీనియర్‌ హెచ్‌ఎంలకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే ఒక్కో ఎంఈవో రెండు నుంచి మూడు మండలాల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. మండల స్థాయిలో అధికారి లేకపోవడంతో ఉపాధ్యా యుల పనితీరు ఇష్టారాజ్యంగా మారిందని చెప్పవచ్చు. చాలామంది పాఠశాలలకు వెళ్లకుండానే ప్రైవేటు పనులు చక్కదిద్దుకుంటున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులైతే.. అసలు పాఠశాలల మొఖం చూడటం లేదు. మండల స్థాయిలో పర్యవేక్షణ సరిగా లేక.. ప్రభుత్వ విద్యావ్యవస్థ చాలా దెబ్బతింటోంది. ముఖ్యంగా తండాల పాఠశాలలు, ప్రైమరీ పాఠశాలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఉన్నత పాఠశాలల్లో ఎక్కువ మంది టీచర్లు ఉన్నందువల్ల ఒకరిపై ఒకరు చెప్పుకుంటారని, కొంత హాజరు శాతం మెరుగ్గా ఉంటున్నప్పటికీ.. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ పాఠశాలల్లో మాత్రం టీచర్ల పనితీరు దారుణంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Feb 29 , 2024 | 11:11 PM