Share News

హామీలు నెరవేర్చకుండానే రైతు సంబురాలా

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:53 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే రైతు సంబరాలు నిర్వహిస్తారా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.

హామీలు నెరవేర్చకుండానే రైతు సంబురాలా
మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 28. (ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే రైతు సంబరాలు నిర్వహిస్తారా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంబురాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఆరె గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు, రైతులకు హామీ ఇచ్చిన విషయం యావత్‌ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. కానీ ఆ హామీల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు జరగలేదన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయి రైతు సంబరాలు జరుపుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఏడాది కావస్తున్న ధరణి సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి పనులకు నిధులు లేక పెండింగ్‌లో ఉన్న పనులన్నీ మగ్గుతున్నాయన్నారు.. ఇవేవీ చేయకుండానే రైతు సంబరాల పేరిట ప్రభుత్వం రైతు సభ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, ఈ వైఫల్యాలను ఎండగడుతూ డిసెంబరు 1 నుంచి 5 వరకు పల్లెపల్లెన ప్రజలకు వివరిస్తూ బైక్‌ ర్యాలీలను నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎగ్గని నర్సిములు, నాయకులు కొండయ్య, ఎంబీ బాలకృష్ణ, నాగేశ్వర్‌రెడ్డి, నలిగేసి రమేశ్‌ కుమార్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, పాండురంగారెడ్డి, అంజమ్మ, యాదయ్య, మాధవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:53 PM