Share News

విద్యుత్‌ తీగలు తగిలి రైతు దుర్మరణం

ABN , Publish Date - May 30 , 2024 | 11:25 PM

దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలకుండా కర్రసాయంతో పైకిఎత్తి పట్టుకునే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలలో గురువారం చోటుచేసుకున్నది.

 విద్యుత్‌ తీగలు తగిలి రైతు దుర్మరణం
మృతి చెందిన వున్నూరుబాష (ఫైల్‌)

అలంపూర్‌ చౌరస్తా, మే 30 : దుక్కి దున్నుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలకుండా కర్రసాయంతో పైకిఎత్తి పట్టుకునే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మారమునగాల -2 గ్రామానికి చెందిన రైతు వున్నూరు బాష (45) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన పొలాన్ని రెండేళ్లుగా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌కు పొలాన్ని సిద్ధం చేసేందుకు గురువారం తన కుమారుడు షేక్షవలి, డ్రైవర్‌ రాజుతో కలిసి ట్రాక్టర్‌ను తీసుకొని పొలానికి వెళ్లాడు. పొలంలో చాలా ఏళ్లుగా విద్యు త్‌ తీగలు కిందకు వేలాడుతూ ఉన్నా జాగ్రత్తగా వ్యవసాయ పనులు చేసుకునేవారు. ఇదే క్రమంలో దుక్కిదున్నుతున్న ట్రాక్టర్‌కు తీగలు తగిలే పరిస్థితి ఉండటంతో ఓ కర్ర సాయంతో తీగకు తీగ కలువకుండా ఉండేందుకు అక్కడక్కడ కర్రలను కట్టుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఒక కర్రను పైకిఎత్తి పట్టుకొని ఉండగా తీగల మధ్య ఉన్న చిన్నపాటి కర్ర విరిగిపోయింది. దీంతో వున్నూరుబాష పట్టుకున్న నిలువుకర్ర జారి కిందపడటంతో రైతు చేతికి విద్యుత్‌ వైరు తగిలింది. అప్పటికే ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌ చేసినా మరో వైపు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఇదే లైన్‌కు కనెక్షన్‌ ఉండటంతో షాక్‌తో రైతు కుప్పకూలిపోయాడు. సమీపంలో ఉన్న అతని కుమారుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌ రాజు హుటాహుటిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే రైతు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య షేక్‌ షాలిబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - May 30 , 2024 | 11:25 PM