Share News

ఉత్సాహంగా మల్లయుద్ధం

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:16 PM

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో మల్ల యుద్ధం (కుస్తీ పోటీలు) ఉత్సాహంగా సాగాయి.

ఉత్సాహంగా మల్లయుద్ధం
బరిలో తలపడుతున్న పంజాబ్‌, హర్యానా మల్ల యుద్ధ వీరులు

- పోటీల్లో పాల్గొన్న 30 మంది యోధులు

- విజేతలకు బహుమతులందించిన ఎస్‌ఐ, మునిసిపల్‌ చైర్మన్‌

అయిజ, మార్చి 4 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో మల్ల యుద్ధం (కుస్తీ పోటీలు) ఉత్సాహంగా సాగాయి. తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పోటీలలో పాల్గొనటానికి పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక నుంచి 30 మంది మల్లయుద్ధ వీరులు తరలివచ్చారు. ఈ పోటీలను సోమవారం సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ సంకాపూర్‌ రాముడు ప్రారంభించారు. ఈ పోటీలలో 35 మంది మల్ల యుద్ధ యోధులు పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన ఈ పోటీలు రాత్రి వరకు హోరాహోరిగా కొనసాగాయి. మొదటి స్థానాన్ని కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా, చండ చందు గ్రామానికి చెందిన రామ్‌చందర్‌ దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన రుద్రేశ్‌యాదవ్‌ రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. మూడవ స్థానాన్ని హర్యానాకు చెందిన వికాస్‌ దక్కించుకున్నారు. నాలుగవ స్థానాన్ని సంగారెడ్డికి చెందిన చరణ్‌ దక్కించుకున్నారు. ఐదవ స్థానాన్ని మెదక్‌కు చెందిన రామ్‌శెట్టి దక్కించుకున్నారు. విజేతలకు ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ద్ధన్‌రెడ్డి చేతుల మీదుగా బహమతులు అందచేశారు.

Updated Date - Mar 04 , 2024 | 11:16 PM