ఉప్పొంగిన తుంగభద్ర
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:25 PM
తుంగభద్ర నదికి వరద పోటెత్తుతోంది

- నీట మునిగిన కూరగాయల తోటలు
రాజోలి, జూలై 28 : తుంగభద్ర నదికి వరద పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యాంనుంచి వరద నీరు అధికంగా రావడంతో రాజోలి శివారులోని సుంకేసుల డ్యాం వద్ద నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో నది అందాలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రంలోని కర్నూలు నుంచి పలువురు కుటుంబ సభ్యులతో, కలిసి వచ్చారు. యువతీ, యువకులు పిల్లలు డ్యాంపై సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ద్విచక్రవాహనాలు, కార్లలో సందర్శకులు తరలిరావడంతో సందడి నెలకొన్నది. సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 1.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, ఆదివారం డ్యాం 28 గేట్లు తెరిచి 1.42 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నదీ తీరంలోని ఉన్న రాజోలి, తూర్పు గార్లపాడు, బుడమర్సు గ్రామాల శివారులో 10 ఎకరాలకు పైగా కూరగాయల తోటలు నీట మునిగాయి. మరికొన్ని చోట్ల వరి నాట్లు వేసిన పొలాల్లో నీరు చేరింది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.