సర్వం సిద్ధం
ABN , Publish Date - May 12 , 2024 | 11:07 PM
జిల్లా వ్యాప్తంగా సోమవారం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల నిర్వాహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

- 171 మంది సూక్ష్మ పరిశీలకులు
- జిల్లాలో 2,624 మంది పోలీస్ సిబ్బంది
- పేట సెగ్మెంట్‌లో 270, మక్తల్ సెగ్మెంట్‌లో 284 పోలింగ్ కేంద్రాలు
- నారాయణపేట, మక్తల్ సెగ్మెంట్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ
నారాయణపేట, మే 12 : జిల్లా వ్యాప్తంగా సోమవారం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల నిర్వాహణకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆదివారం నారాయణపేట దత్త బృందావన్ కళాశాలలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సామగ్రిని సూక్మ పరిశీలికులు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి రవినాయక్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి 171 మంది సూక్మ పరిశీలకులను నియమించారు. నారాయణపేట నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 31 రూట్లను విభజించి బస్సులు, జీపుల్లో సిబ్బంది, సామగ్రిని తరలించారు. మక్తల్ నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 35 రూట్లను విభజించి, సామగ్రిని వాహనాలో తరలించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలను మోహరించగా మొత్తం 2,624 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. పేట సెగ్మెంట్‌లో 320 మంది ప్రిసైడింగ్ అధికారులు, 320 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 640 ఏపీవోలను నియమించారు. మక్తల్ సెగ్మెంట్‌లో 336 మంది ప్రిసైడింగ్ అధికారులు, 336 సహాయ ప్రిసెడింగ్ అధికారులు, 675 మంది ఏపీవోలు నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలతో పాటు అవసరమైన చోట్ల వీడియో చిత్రీకరణ చేస్తారు. ఇక హోమ్ ఓటింగ్ కోసం నారాయణపేట సెగ్మెంట్‌లో 33 మంది దరఖాస్తు చేసుకోగా, 32 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్తల్ సెగ్మెంట్‌లో ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా, ఎనిమిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పేట గురుకుల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పేట సెగ్మెంట్‌లో ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఐదు మహిళా కేంద్రాలు, ఒక యువ ఓటింగ్ కేంద్రం, ఒకటి దివ్యాంగుల ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పేట సెగ్మెంట్‌లో 2,36,182 మంది ఓటర్లు ఉండగా, మహిళలు 1,19,682 మంది, పురుషులు 1,16,497 మంది ఉండగా, ఇతరులు ముగ్గురు ఉన్నారు. మక్తల్ సెగ్మెంట్‌లో 2,44,173 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,19,809 మంది, మహిళలు 1,24,363 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.