Share News

బాల్యానికి భరోసా

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:02 PM

బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

బాల్యానికి భరోసా
బడి బయటి పిల్లలను గుర్తిస్తున్న సీఆర్పీలు - ఫైల్‌

- జిల్లాలో బడి బయట పిల్లలు 486 మంది

నారాయణపేట, జనవరి 25 : బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్తుకు బాట వేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బడి బయట పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వేను విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈనెల 31తో ముగియనుంది. బడి బయటి పిల్లలను గుర్తించి ప్రబంధ పోర్టల్‌లో వివరాలను నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 514 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 72,493 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రతీ పాఠశాల కాంప్లెక్స్‌ పరిధిలో క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్ల ఆధ్వర్యంలో సర్వే ముగిసింది. సీఆర్పీలు బడి బయటి పిల్లలను గుర్తించి వారి వయసును బట్టి ఆయా పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆరు నుంచి 14 ఏళ్లులోపు వయసున్న వారు 260 మందిని గుర్తించగా, 15 నుంచి 19 ఏళ్ల వయసున్న వారు 222 మందిని మొత్తం 486 మందిని గుర్తించి బడిబాట పట్టించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇది వరకే గతంలో 2019 ఆర్థిక సంవత్సరానికి గాను 935 మంది బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించారు. 2020 సంవత్సరంలో 782 మంది బడి పిల్లలను, 2022లో 235 మంది బడి బయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేలా చర్యలు తీసుకున్నారు.

పకడ్బందీగా సర్వే..

విద్యాశాఖ ఆదేశాల మేరకు డిసెంబరు 11 నుంచి జనవరి 31వ తేదీ వరకు బడి బయటి పిల్లలను గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహిస్తున్నాం. స్కూల్‌ కాంప్లెక్స్‌ వారిగా సీఆర్పీలతో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి ఆరు నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న బడి బయటి పిల్లలను గుర్తించి ప్రతీ రోజు ప్రబంధ పోర్టల్‌లో వివరాలు నమోదు చేశాం. జిల్లాలో బడి బయటి పిల్లలను పూర్తి స్థాయిలో పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

విద్యాసాగర్‌, ఏఎంవో, నారాయణపేట

Updated Date - Jan 28 , 2024 | 11:02 PM