Share News

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:26 PM

బాల కార్మిక వ్యవస్ధను, బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌, అధికారులు

- గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- వాల్‌ పోస్టర్‌ విడుదల

గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 12 : బాల కార్మిక వ్యవస్ధను, బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్ధ వ్యతిరేక దినోత్సవం సందర్బంగా బుధవారం తన చాంబర్‌లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయ న మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను పనిలో పెట్ట కుండా, వారి ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ, ఉపాధి, సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలతో బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించినట్లు తెలి పారు. ఇంకా పిల్లలు బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలని సూచించారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాన్‌ ఇండియా రెస్క్యూ, రిహబిలిటేషన్‌ కార్యక్రమాన్ని ఈనెల ఒకటి నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు ఈ నెల 30 వరకు స్సెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి బాల కార్మికులకు విముక్తి కల్పిం చేందుకు కృషి చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థనిర్మూలనకు స్వచ్ఛంద సేవా సంస్థలు, యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. గత ఏడాది 132 మందిని, ఈ ఏడాది ఇప్పటివరకు 85 మంది బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై రూపందించిన పోస్టర్‌ను విడుదల చేశా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూవో సుధారాణి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ, సీడబ్ల్యూసీ చైర్మన్‌ సహదేవుడు, డీసీపీవో నర సింహ, సెక్టోరియల్‌ అధికారి ఎస్తేరురాణి పాల్గొన్నారు.

విద్యతోనే బాలికార్మిక వ్యవస్థ నిర్మూలన

వడ్డేపల్లి : బాలకార్మిక వ్యవస్థను సమూలంగా ని ర్మూలించాలంటే విద్యతోనే సాధ్యమని, ఆ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వడ్డేపల్లి మండలం, బుడమెర్సు గ్రామంలో సీఆర్‌పీఎఫ్‌, యువత, గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వ హించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు బాలకార్మిక నిర్మూలనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్‌, ఎంఈవో నర్సింహ, ఎంపీఈవో తిరుపతన్న, జేఏసీ నాయకులు మధుబాబు, ప్రధానోపాధ్యాయుడు రవీం ద్ర, మాజీ సర్పంచు తిమ్మప్ప, సీఆర్‌పీఎఫ్‌ మండల కన్వీనర్‌ గొల్ల సుధాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు నాగశిరోమణి, హనిమిరెడ్డి, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ సీఆర్‌పీఎఫ్‌ మండల కమిటీ సభ్యులు జడ్పీ చైర్‌పర్సన్‌ సరితకు వినతిపత్రం ఇచ్చారు.

హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

గట్టు : బాలల హక్కులను పరిరక్షించడం అందరి భాద్యత అని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ కోకన్వీనర్‌ తిమ్మప్ప అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఇందు వాసి గ్రామంలో బాలల తల్లితండ్రులతో సమావేశం నిర్వహించారు. ముందుగా పోస్టర్‌ను విడుదల చేశా రు. కార్యక్రమంలో ఏఏపీ కమిటీ చైర్‌పర్సన్‌ భీమక్క, యూత్‌ మదర్స్‌ కమిటీ కన్వీనర్‌ సునీత, ఎంవీఎఫ్‌ కార్యకర్త నర్సన్న పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:26 PM