నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:18 PM
వైద్య సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్
మద్దూర్, సెప్టెంబరు 10 : వైద్య సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం మద్దూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఎంతమంది మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు ఉన్నారని ఆరా తీశారు. రెండు రోజుల క్రితమే నలుగురు వైద్యులు నియామకం అయ్యారని, ఓ వైద్యురాలు కలెక్టర్‌కు వివరించారు. ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి సంబంధించిన ఆలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని మక్తల్ ఆసుపత్రికి తరలించారని, వాటిని తిరిగి ఆసుపత్రికి తీసుకురావాలని రోగుల బంధువులు కలెక్టర్‌కు విన్నవించారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహేష్‌గౌడ్, ఆసుపత్రి సిబ్బంది ఉన్ననరు.
కాడా పరిధిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
నారాయణపేట టౌన్ : కాడా పరిధిలో అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి అధికారులతో కోస్గి కో ఆర్డినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. భూసేకరణ పనులు, రోడ్డు పనులు ముమ్మరం చేయాలన్నారు. పబ్లిక్ హెల్త్ పనులు వారంలోపు పూర్తి చేయాలన్నారు. కోస్గి ఆర్‌అండ్‌బీ పనులపై ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే కోస్గిలో గెస్ట్‌హౌజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. మద్దూరులో రోడ్డు వైడనింగ్‌పై మాట్లాడారు. మల్లికార్జున్, రాములు, బక్క శ్రీను, మునిసిపల్ కమిషర్లు పాల్గొన్నారు.
ఆరోగ్య వాహిని సేవలను ప్రశంసించిన కలెక్టర్
నారాయణపేట రూరల్ : మండల పరిధిలోని జాజాపూర్ గ్రామంలో ఆరోగ్య వాహిని సేవలను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి, ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు మొబైల్ వ్యాన్ ద్వారా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇక ముందు కూడా ఆరోగ్య వాహిని సేవలు కొనసాగించాలన్నారు. ఆరోగ్య వాహిని జిల్లా మేనేజర్ నర్సిములు, మాజీ సర్పంచ్ కోట్ల సుగంధమ్మ, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.