Share News

‘మిషన్‌ భగీరథ’పై ఇంటింటి సర్వే

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:21 PM

మిషన్‌ భగీరథపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది.

‘మిషన్‌ భగీరథ’పై ఇంటింటి సర్వే
జూరాల ప్రాజెక్టు వద్దనున్న మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్‌

- యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

- ప్రజల నుంచి మిశ్రమ స్పందన

గద్వాల, జూన్‌ 11 : మిషన్‌ భగీరథపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభమై అయిదేళ్లయినా క్షేత్ర స్థాయిలో సమస్యలు వెంటాడుతున్నాయి. పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతోంది. కొన్ని గ్రామాల్లో నల్లాలు కూడా అమర్చలేదు. పైపులైన్లు, లీకేజీల మరమ్మతు ఖర్చులను గ్రామ పంచాయితీలే భరిస్తున్నాయి. తాగు సరఫరా లేని ఆవాసాలు, ప్రాంతాలు, ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వేను ప్రారంభించింది.

సర్వే సాగనుంది ఇలా..

జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పది రోజుల పాటు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. సర్వేలో మిషన్‌ భగీరథ అధికారులకు భాగస్వామ్యం కల్పించలేదు. వారిని పక్కకు పెట్టి ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులు, ఉపాధి ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఐకేపీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి, వారికి విక్షణ ఇచ్చి సర్వే కు పంపించారు. వారు ప్రతీ రోజు 25 నుంచి 30 ఇళ్లను సర్వే చేసి వివరాలను సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సర్వేలో మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ ఉందా...?, నీళ్లు వస్తున్నాయా...?, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి. 100 లీటర్లు వస్తున్నాయా..? వచ్చే నీళ్లు మిషన్‌ భగీరథం నీళ్లా...? స్థానిక బోరుబావుల నీళ్లా..? తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే యజమాని పేరు, ఆధార్‌, సెల్‌ నెంబర్లతో కలిపి యాప్‌ లో నమోదు చేస్తున్నారు. యజమాని ఫోటో, ఇంటితో పాటు, నల్లా పోటోను కూడా తీసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత యజమాని సెల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్‌ చేస్తే ధ్రువీకరణ పూర్తవుతుంది.

అన్నీ రైటే అన్నట్లుగా నమోదు

కాగా ఇంటింటా సర్వేకు వెళ్లిన సర్వే అధికారులకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. నీళ్లు రావడం లేదని కొందరు, వచ్చినా కొద్దిగానే వస్తున్నాయని మరి కొందరు చెబుతున్నారు. ఇంకొందరు మిషన్‌ భగీరథ కనెక్షన్‌ ఉన్నా, స్థానికంగా ఉన్న బోర్లు, బావుల ద్వారానే నీరు సరఫరా అవుతోందని అంటున్నారు. కానీ సర్వే అధికారులు వాటిని పట్టించుకోకుండా నల్లా ఉంది, నీళ్లు వస్తున్నాయి అని, అన్నీ రైటే అన్నట్లుగా నమోదు చేస్తు న్నారు. ఉదాహరణకు గుర్రంగడ్డ గ్రామానికి మిషన్‌ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు. అయిన పైపు లైన్ల ద్వారా నీరు సరఫరా అవుతోందంటూ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. కొన్ని గ్రామాల్లో కొత్త కాలనీలకు స్థానిక(ఆర్‌డబ్ల్యూఎస్‌) పథకాల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా, సాఫీగా నీటి సరఫరా అని నమోదు చేస్తున్నారు.

జిల్లాలో మిషన్‌ భగీరథ అమలు ఇలా..

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకానికి జూరాల ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అవుతోంది. రూ.700 కోట్లతో పథకాన్ని పూర్తి చేసి 2018, జూలైలో ప్రారంభించారు. గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లోని 313 గ్రామాలు (255 గ్రామ పంచాయితీలు) నాలుగు మునిసిపాలిటీలకు నీటి సరఫరా జరుగుతోంది. ప్రతీ రోజు 80 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్లు) సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం 1,234 కిలోమీటర్ల చొప్పున పైపులైన్‌లో వేయడంతో పాటు పెద్ద ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. తుంగభద్ర నదికి అవుతలి గ్రామాలు ర్యాలంపాడు, జిల్లలపాడు, సుల్తానాపురంలకు గత ఏడాది నుంచి మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. కానీ కృష్ణానది మధ్యనున్న దీవి గ్రామం గుర్రంగడ్డకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు.

సర్వే ద్వారా మెరుగైన సేవలు

సర్వే చేయడంతో చాలా విషయాలు తెలుస్తాయి. దాని వలన మెరుగైన సేవలు అందించవచ్చు. మిషన్‌ భగీరథ నీళ్లు రానిచోట, కొత్త ఆవాసాలు ఏర్పడిన చోట అవకాశం కల్పించవచ్చు. ప్రభుత్వానికి పూర్తి సమాచారం చేరుతుంది. ఇందులో మిషన్‌ భగీరథ అధికారులకు, సిబ్బందికి బాగస్వామ్యం లేదు. ఇతర డిపార్ట్‌మెంట్ల వారితో సర్వే జరుగుతుంది.

- శ్రీధర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈ

Updated Date - Jun 11 , 2024 | 11:21 PM