Share News

రోగులతో దురుసుగా వ్యవహరించొద్దు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:34 PM

రోగులతో దురుసుగా వ్యవహరించొద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్య సిబ్బందికి సూచించారు.

 రోగులతో దురుసుగా వ్యవహరించొద్దు

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- రక్త పరీక్షలకు బయట ల్యాబ్‌కు పంపడంపై ఆగ్రహాం

- జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ, రెండు గంటల పాటు అన్ని వార్డుల పరిశీలన

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 7 : రోగులతో దురుసుగా వ్యవహరించొద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి, దాదాపు రెండు గంటల పాటు ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలియ తిరిగారు. ముందుగా ఆసుపత్రి పై అంతస్తులో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డును పరిశీలించి వర్షం వస్తే వార్డు లోపలికి వర్షపు నీరు వస్తుందా? లేదా అని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంజిత్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెటర్నటీ వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌, సీ సెక్షన్‌ వార్డు, ఆర్థోపెడిక్‌, సర్జికల్‌, జనరల్‌ వార్డును పరిశీలించారు. ఆర్థోపెడిక్‌ వార్డులో ఉన్న ఐదుగురి పేషెంట్లలో ముగ్గురి రక్త పరీక్షలను ప్రైవేటు ల్యాబ్‌కు పంపించి చేయిం చినట్లు గుర్తించిన కలెక్టర్‌ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించకుండా ప్రైవేటు ల్యాబ్‌కు ఎందుకు పంపించారని అక్కడ ఉన్న నర్సులను ప్రశ్నించారు. ప్రైవేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలకు ఎంత మేర ఖర్చు అయ్యానని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్థోపెడిక్‌ విభాగాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ప్రైవేటు ల్యాబ్‌కు రక్త పరీక్షల కోసం ఎందుకు రెఫర్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతం కారాదని అక్కడి నర్సులకు హెచ్చరించారు. ఇక సర్టికల్‌ వార్డులో నర్వకు చెందిన ఓ తల్లి తన కొడుకును ఆపరేషన్‌ కోసం తీసుకురావడంపై కలెక్టర్‌ ఆరా తీశారు. వనపర్తి ఆసుపత్రి దగ్గరగానే ఉన్నా ఇక్కడికి ఎలా వచ్చారని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల కేస్‌ షీట్లను కలెక్టర్‌ పరిశీలించారు. రోగులకు మెను ప్రకారం భోజనం ఇవ్వకపోతే నిర్వాహకులకు ఇచ్చే అమౌంట్‌లో కట్‌ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగంలో ఉన్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా సరిగ్గా లేకపోవడం ఆసుపత్రిలో పవర్‌ బోరు ద్వారా ఉప్పు నీరు వస్తుందని తెలుసుకున్న కలెక్టర్‌ ఆసుపత్రి ఆవరణలో ఆర్వోబీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూపరింటెండెంట్‌ రంజిత్‌కుమార్‌ను ఆదేశించారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ పావని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:34 PM