Share News

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:08 PM

అధికారులు, ప్రత్యేకాధికారులు కలిసికట్టుగా ఉంటూ, గ్రామాల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎంపీపీ మరియమ్మ అన్నారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ మరియమ్మ

- తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి

- సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మరియమ్మ

రాజోలి, ఫిబ్రవరి 7 : అధికారులు, ప్రత్యేకాధికారులు కలిసికట్టుగా ఉంటూ, గ్రామాల్లో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఎంపీపీ మరియమ్మ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల అఽధికారులు శాఖలవారిగా ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందేలా చూడాలని, రాష్ట్రం సరిహద్దులో ఉన్న రాజోలికి ప్రత్యేక ఆంబులెన్సు ఏర్పాటు చేయాలని జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు నిషాక్‌ కోరారు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గతవారం ఐదుగురికి కుక్క కాటు చికిత్స అందించామని మండల వైద్యాధికారి డాక్టర్‌ మధుబాబు తెలిపారు. గ్రామాల్లో కుక్కలను అదుపు చేయాలని కోరారు. ఈ నెల 12న నిర్వహించే నులిపురుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గ్రిడ్‌ అధికారి సంతోష్‌ అన్నారు. కొత్త రాజోలి, పాత రాజోలికి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ విద్యుత్‌ శాఖ ఏఈ సందీప్‌ను కోరారు. సమావేశంలో ఎంపీడీవో గోవిందురావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ శర్మ, ఎంపీటీసీ సభ్యులు షాషావలి, చిట్టెమ్మ, మన్సూర్‌మియా, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు చేయాలి

కేజీబీవీ కస్తూర్బా బాలికల పాఠశాలను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిప్పన్న కోరారు. మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం అనంతరం మండల కమిటీ సభ్యులతో కలిసి ఎంపీపీ మరియమ్మకు వినతిపత్రం ఇచ్చారు. కస్తూర్బా పాఠశాలను గతంలో రాజోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించేవారని, అక్కడ నుంచి వడ్డేపల్లిలోని కస్భూర్బా పాఠశాల అదనపు భవనానికి తరలించారని తెలిపారు. వారు ఖాళీ చేయాలని చెప్పడంతో, ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామానికి తరలిస్తున్నారని వివరించారు. కస్తూర్బా బాలికల పాఠశాలను రాజోలిలోనే ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేయాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ గోపాల్‌ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు బీసన్న, భీమన్న పాల్గొన్నారు.

మాజీ సర్పంచులకు ఘన సన్మానం

మండలంలోని 11 గ్రామ పంచాయతీల తాజా మాజీ సర్పంచులను ఎంపీపీ మరియమ్మ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. వారికి శాలువా కప్పి, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ శర్మ, ఎంపీడీవో గోవింద్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు నిషాక్‌, పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:08 PM